వజ్రం.. నవరత్నాల్లో ఇది కూడా ఒకటి. చాలా విలువైన రాయి ఇది. అంత సులభంగా పగలదు. అంత సులువుగా దొరకదు. కనుకనే ఇది చాలా విలువైందిగా మారింది. ఈ క్రమంలో వజ్రాలు పొదిగిన ఆభరణాలను చాలా మంది ధరిస్తున్నారు కూడా. కొందరైతే ఆభరణాలు మాత్రమే కాదు, ఫోన్లు, లో దుస్తులు ఇతర వస్తువులకు కూడా వజ్రాలను అమర్చి అమ్ముతున్నారు. వాటకి కూడా గిరాకీ ఉంది లెండి, అది వేరే విషయం. అయితే మీకు తెలుసా..? అసలు వజ్రాలు ఎలా తయారవుతాయో..? ఎక్కడి నుంచి వస్తాయో..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
భూమిలోపల దాదాపుగా 140 నుంచి 190 కిలోమీటర్ల లోతున కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకునిపోయిన పదార్థాల్లో ఉండే కార్బన్ అణువులతో ఏర్పడతాయి. అంత లోతున ఉండే అధిక ఉష్ణోగ్రత, పీడనం కారణంగా వజ్రాలు తయారవుతాయి. అయితే వజ్రాలు అంత సులభంగా తయారు కావు. అవి ఏర్పడేందుకు కొన్ని వందలు, వేల సంవత్సారల సమయం పడుతుంది. వజ్రం తయారయ్యాక అది లోపల ఉండే పీడనాన్ని తట్టుకోలేక భూమి పై పొరలకు వస్తుంది. అప్పుడు ఆ ప్రదేశంపై వర్షం పడినా, లేదంటే ఆ ప్రాంతంలో నది ఉన్న అవి ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకువస్తాయి.
అయితే ఇప్పుడు వజ్రాలను గనుల్లో తవ్వి తీస్తున్నారు. బొగ్గు, బంగారం తీసినట్టే వజ్రాలను తీస్తారు. కానీ అవి ముడిపదార్థంగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని అనేక ప్రక్రియలకు గురి చేస్తారు. అనంతరం సాన బెడతారు. అప్పుడే అవి మన కంటికి ఇంపుగా మెరుస్తూ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో ఎవరు కోరుకున్న సైజ్‌ను బట్టి వారికి వజ్రాలను అమ్ముతారు. అయితే 1867లో దక్షిణాఫ్రికాలో ఓ నది ప్రవాహంలో కొందరికి వజ్రాలు దొరికాయట. అందుకని అప్పటి నుంచి నదీ ప్రవాహాల్లో వజ్రాలను వెదకడం ఆరంభించారు. ఈ క్రమంలోనే వర్షాలకు వజ్రాలు కొట్టుకు వస్తున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అప్పుడప్పుడు పర్వతాల్లో వాగులు, ఇతర నదీ ప్రవాహాల్లో స్థానికులు వజ్రాలను వెతుకుతున్నారు. గతంలో కొందరికి వజ్రాలు దొరికాయట. అందుకని ప్రతి ఏటా వర్షం పడినప్పుడల్లా చాలా మంది బాక్సులు కట్టుకుని మరీ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల కోసం వెతకడం మొదలు పెట్టారు. అవును మరి, ఎంతైనా చాలా విలువైంది కదా వజ్రం. చిన్న ముక్క దొరికినా చాలు కోటశ్వరులను కాకపోయినా లక్షాధికారులను అయినా చేస్తుందది..!
వజ్రం గురించిన పలు ఆసక్తికర విషయాలు ఇవే…
అన్ని దేశాల కన్నా వజ్రాలు మన దేశంలోనే ముందుగా దొరికాయట. దాదాపుగా 3వేల నుంచి 6 వేల ఏళ్ల కిందటి నుంచే మన దేశంలో వజ్రాలను తీయడం మొదలు పెట్టారట. వజ్రాలు అసలు ఏ పదార్థాంతో ఏర్పడుతాయో ఇప్పటికీ సైంటిస్టులు కనుగొనలేకపోయారు. కానీ కొన్ని వేల ఏళ్ల కిందట భూమిలోకి కూరుకుపోయిన చెట్లు, కార్బన్ పదార్థాలు, బొగ్గు వంటి వాటి వల్ల వజ్రాలు ఏర్పడుతాయని కొందరు చెబుతున్నారు. వజ్రం చాలా కఠినమైన పదార్థం. అంత సులభంగా పగలదు. అందుకే దీన్ని గాజు కటింగ్ కోసం వాడుతారు. Diamond అనే పదం ప్రాచీన గ్రీకు భాష నుంచి వచ్చింది. ఆ భాషలో డైమండ్ అంటే విడదీయలేనిది అని అర్థం వస్తుంది. వజ్రం సహజంగానే ఏర్పడాలి తప్ప దాన్ని ల్యాబ్‌లలో తయారు చేయలేరు. కొందరు ఆ ప్రయత్నాలు చేశారు కానీ, వజ్రం లాంటి క్వాలిటీ రాలేదు.
వజ్రం ఎలాంటి ద్రావణంలోనూ కరగదు. వజ్రం గుండా విద్యుత్, వేడి ప్రసారం కావు. ఇది అథమ ఉష్ణవాహకం మాత్రమే కాదు, అథమ విద్యుద్వాహకం కూడా. ఎలాంటి యాసిడ్లు, క్షారాలు వజ్రాన్ని ప్రభావితం చేయలేవు. అసలైన వజ్రానికి రంగు అంటూ ఏదీ ఉండదు. దాని గుండా కాంతిని ప్రసారం చేసినప్పుడు అన్ని రంగులను అది వెదజల్లుతుంది. వంద శాతం బంగారానికి కొంత రాగి కలిపి ఆభరణాలను తయారు చేస్తారని తెలిసిందే. దీంతో ఆ నగలు చాలా దృఢంగా ఉంటాయి. అలాగే వజ్రాలకు కూడా నైట్రోజన్, బోరాన్ వంటివి కలుపుతారు. దృఢత్వం కోసం కాదు కానీ, వీటిని కలపడం వల్ల వజ్రానికి రంగులు వస్తాయి. నైట్రోజన్ వల్ల వజ్రానికి పసుపు లేదా గోధుమ రంగు వస్తుంది. అదే బోరాన్ వల్లనైతే నీలి రంగు వస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వజ్రాల్లో 92 శాతానికి పైగా వజ్రాలు మన దేశంలోని సూరత్‌లో కట్ చేయబడి, పాలిష్ చేయబడతాయి. ప్రపంచ వ్యాప్తంగా లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోనూ డైమండ్ కటింగ్, పాలిషింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 26వేల కిలోల వజ్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. వజ్రాలను మింగితే చనిపోయినట్టు సినిమాల్లో చూపిస్తారు. కానీ నిజానికి వాటిల్లో మనిషిని చంపే హానికర రసాయనాలు ఏవీ ఉండవు. కాకపోతే అవి చాలా పదునుగా ఉంటాయి కనుక లోపల డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకపోతే అవి మరుసటి రోజు మలంలో వచ్చేస్తాయి.