మొలకలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. శరీరానికి శక్తిని, పోషణను అందిస్తాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. అధిక బరువు, కొలెస్ట్రాల్, షుగర్‌ను తగ్గిస్తాయి. ఇలా మొలకలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ కొందరు మాత్రం మొలకలను తినకూడదని వైద్యులు చెబుతున్నారు. తింటే లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని వారు అంటున్నారు. ఇక ఎవరెవరు మొలకలను తినకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీలు మొలకలను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అజీర్తి ఉన్నవారు, అలర్జీలు ఉన్న గర్భిణీలు మొలకలను తింటే పడదు. కనుక వారు ముందుగా డాక్టర్ సలహా తీసుకుని మొలకలను తినాల్సి ఉంటుంది. చిన్నారులు, వృద్ధులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కనుక వీరు మొలకలను తినకూడదు. తింటే కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్నవారు కూడా మొలకలను తినకూడదు. లేదంటే ఇవి వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లను కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు మొలకలను తింటే వైరల్ ఫీవర్ వచ్చే చాన్స్ ఉంటుంది. కనుక వీరు కూడా మొలకలను తినకూడదు. అలాగే విరేచనాలు అవుతున్నవారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు కూడా మొలకలను తినరాదు. తింటే సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు.