స్థూలకాయంతో బాధ పడుతున్నవారినే కాదు, సాధారణ బరువు ఉన్న వారిని సైతం అధిక పొట్ట ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే శరీరంలో ఏ భాగం సంగతి పక్కన పెట్టినా ప్రధానంగా అధికంగా ఉన్న పొట్టను తగ్గించుకోవాలని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సులభంగా అధిక పొట్టను తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ మిశ్రమాన్ని తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే అధికంగా ఉన్న పొట్ట తగ్గిపోతుంది. కొవ్వును కరిగించే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. అయితే ఈ మిశ్రమానికి కావాలనుకుంటే కొంత తేనెను కూడా కలుపుకోవచ్చు.
మన శరీరానికి మేలు చేసే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు అల్లంలో ఉన్నాయి. ఇది కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత అల్లం రసం కలుపుకుని తాగుతున్నా ఫలితం ఉంటుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. నిత్యం కొన్ని వెల్లుల్లి రేకులను ఉదయాన్నే తినగలిగితే చాలు. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. బాదంపప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో తోడ్పడుతాయి. ప్రతి రోజూ కొన్ని బాదం పప్పులను తింటే ఫలితం ఉంటుంది.
ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలపాలి. దీన్ని భోజనానికి కనీసం అరగంట ముందు తాగాలి. దీంతో ఆకలి బాగా తగ్గుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలో ఆహారం తక్కువగా తింటారు. అంతేకాదు, కొవ్వును కరిగించే గుణాలు యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండడంతో బరువు కూడా తగ్గుతారు. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి రసం తీయాలి. ఆ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే తాగాలి. దీంతో పొట్ట దగ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. ఇది క్యాలరీలను కరిగించడంలో తోడ్పడుతుంది. ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు అలోవెరా జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో బాగా కలిపి తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో అదనంగా కొవ్వు చేరదు. అంతేకాదు మలబద్దకం ఉన్నా పోతుంది.
భోజనానికి ముందు పుచ్చకాయ ముక్కలను తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది మనం తినే ఆహారాన్ని తగ్గించి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. బీన్స్‌ను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటున్నా ఫలితం ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. చాలా సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తినడం తక్కువై బరువు తగ్గుతారు. కీరదోసకాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో భోజనానికి అరగంట ముందు ఉదయం, సాయంత్రం వేళల్లో తాగితే కొవ్వు కరిగిపోతుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది.
రోజూ ఉదయాన్నే పరగడుపున బాగా పండిన 1 లేదా 2 టమాటాలను తినాలి. దీంతో పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. టమాటాల్లో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే పదార్థం రక్తంలో ఉన్న కొవ్వును తొలగిస్తుంది.