అది నేను ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం వెళ్లిన రోజు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నాన్న, నేను ఇద్దరం కాన్పూర్ మెడికల్ కాలేజీకి వెళ్లాం. అక్కడే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యా. అయితే కౌన్సిలింగ్ ప్ర్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అందుకనే మేం 3 రోజుల ముందుగానే వచ్చాం. ఇంటి దగ్గర అమ్మ చేసిన 15 చపాతీలు, కొంత వెన్న, పచ్చడి తీసుకుని వచ్చాం. అయితే కాలేజీ లోపలికి కేవలం స్టూడెంట్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో నాన్న బయటే ఉండిపోయారు.
కాలేజీలో స్టూడెంట్స్ ఉండడం కోసం ఓపెన్ గార్డెన్‌లో ఏర్పాట్లు చేశారు. నేను అక్కడికి చేరుకున్నా. నాన్న మాత్రం బయటే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు నాన్న నా కోసం అవసరమైన పండ్లు, కూల్‌డ్రింక్స్, ఐస్ క్రీం వంటి ఆహారాలను తెచ్చి ఇవ్వడం ప్రారంభించారు. మిగిలిన పేరెంట్స్‌ను కూడా అందుకు అనుమతిస్తుండడంతో నాన్న కూడా నాకు అలా తెచ్చి ఇస్తూ నన్ను చూసుకునేవారు. అలా 3 రోజులు గడిచాయి. కాలేజీలోనే ఉన్నా.
చివరి రోజున రాత్రి 8 గంటలకు కౌన్సిలింగ్‌లో నా వంతు వచ్చింది. వెళ్లా. కాలేజీల్లో అప్లై చేశా. అంతా అయిపోయింది. పని పూర్తి చేశాక బయటకు వచ్చి నాన్నను కలుసుకున్నా. బాగా ఆకలిగా ఉందని చెప్పా. నన్ను పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ రాగానే తినడం ప్రారంభించా. నాన్నను అడిగా, తినమని. కానీ నాన్న తనకు ఆకలి లేదని, పొట్ట నిండుగా ఉందని చెప్పారు. అయితే అనుకోకుండా టేబుల్ కిందకు చూశా. ఇంటి దగ్గర్నుంచి తెచ్చిన 3 రోజుల కిందట చపాతీలను నాన్న తింటున్నారు. అదీ, నాకు తెలియకుండా బల్ల కింద పెట్టుకుని తింటున్నారు. అది చూసి నాకు గొంతు పూడుకుపోయింది. నోట మాట రాలేదు. అప్పుడర్ధమైంది, నాన్న దగ్గర డబ్బులు అయిపోయాయని. ఉన్నదాంట్లో నాకు బిర్యానీ పెట్టించారని. తాను మాత్రం కడుపు నిండుగా ఉందని అబద్దం చెప్పారు. ఈ సంఘటన తలచుకున్నప్పుడల్లా నా కళ్లు చెమర్చుతాయి.