పట్టు వస్త్రాలు అయితే మడతలు పడకుండా పరిశుభ్రంగా భద్రపరచాలి. పురుగులు, దుమ్ము, ధూళి సోకకుండా, ఎక్కువ గాలి, కాంతి తగలకుండా కాపాడాలి. కలప మీద పట్టు వస్త్రాలను నేరుగా తాకేలా భద్రపరచరాదు. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించరాదు. కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలి. అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. పట్టు చీరలను భద్రపరిచే ప్రదేశంలో సిలికాన్‌జెల్ సంచులను ఉపయోగించాలి.
అగరుబత్తీలు, బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళ లాడతాయి. ఆలివ్ ఆయిల్ లో ముంచిన దూదితో ముత్యాల నగలు తుడిస్తే ముత్యాలు బాగా మెరుస్తాయి.బంగారు గొలుసులు చిక్కు పడినట్లయితే దానిమీద పౌడరు చల్లి చిక్కులను తేలికగా విడగొట్టవచ్చు. బంగారు నగలు పాతబడినట్లుగా ఉంటే పాత టూత్ బ్రష్, సబ్బునీళ్ళు ఉపయోగించి మళ్ళీ తళతళలాడేటట్లుగా చేయవచ్చు. మీరు ముత్యాల ఆభరణాలు తరచూ ధరిస్తారా! అయితే వాటిని తొలగించిన వెంటనే మెత్తని వస్త్రంతో తుడవడం మర్చిపోకండి. ఇలా చేస్తే ఆభరణాలకు చెమట, మేకప్ లో వాడే రసాయనాలు అంటినా ముత్యాలు రంగుమారవు.
ముత్యాల నగలు మెరుపు (షైనింగ్) పోకుండా ఉండాలంటే ఎరుపు పట్టు గుడ్డలో ఉంచితే చాలు. ముత్యాలదండను తరచూ వాడుతుంటే ముత్యాలు రంగు మారవు. కారణం చర్మం దానికి కావలసిన తేమ, నూనెను అందిస్తుంది. వెండి ఆభరణాలు మురికి పట్టినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉడక బెట్టి తరువాత చన్నీళ్ళలో కడిగితే శుభ్రంగా ఉంటాయి.