ముఖ సౌందర్యాన్ని తగ్గించే వాటిలో బ్లాక్ హెడ్స్ కూడా ఒకటి. చర్మం నుంచి అధికంగా ఆయిల్స్ విడుదల అవడం వల్ల ఇవి వస్తాయి. ముక్కుపై, వీపులో, చేతులపై, భుజాలపై కూడా బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవడం కోసం అందరూ నానా తంటాలు పడుతుంటారు. మహిళలైతే ఇక వారు పడే బాధను చెప్పలేం. తమ అందమంతా పోతుందని ఒకటే దిగులు చెందుతారు. అయితే కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే బ్లాక్ హెడ్స్‌ను సింపు ల్‌గా తొలగించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. బ్లాక్ హెడ్స్ మాత్రమే కాదు, మొటిమలను తగ్గించడంలోనూ ఈ మాస్క్ ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, మృత కణాలు తదితరాలను కూడా పోగొడుతుంది. 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కొంత నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఆ పేస్ట్‌ను సమస్య ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా మర్దనా చేస్తూ రాయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేసినా బ్లాక్ హెడ్స్ సులువుగా పోతాయి.
2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌లను తీసుకుని బాగా కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్‌పై రాయాలి. 10 నిమిషాలు ఆగాక వేడినీటితో కడిగేయాలి. దీంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. కోడిగుడ్డులో ఉండే తెల్లనిసొన, కొద్దిగా తేనెలను తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 30 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. 2 టేబుల్ స్పూన్ల చక్కెర, కొద్దిగా తేనెలను కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని సమస్య ఉన్న చోట మసాజ్ చేస్తూ రాయాలి. కొద్ది సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా పసుపులను వేసి బాగా కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో రాసి 15 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీన్ని పాటించినా బ్లాక్ హెడ్స్ పోతాయి. 1 టేబుల్ స్పూన్ చక్కెరను, కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకుని బాగా చిక్కని పేస్ట్‌లా వచ్చేలా కలపాలి. దీన్ని ముఖానికి రాసి కొద్ది సేపు ఆగాక కడిగేయాలి. దీంతో బ్లాక్ హెడ్స్ పోవడమే కాదు, ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది. మార్కెట్‌లో మనకు ఎప్సం సాల్ట్ దొరుకుతుంది. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ ఎప్సం సాల్ట్, కొన్ని చుక్కల అయొడిన్‌ను వేసి ఆ ద్రవాన్ని గది ఉష్ణోగ్రతకు చల్లార్చాలి. అనంతరం ఆ ద్రవాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేసినా బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.
అర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెలను బాగా కలిపి అనంతరం వచ్చే మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్‌పై రాయాలి. 5 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో కూడా బ్లాక్ హెడ్స్ సులభంగా పోతాయి.