శరీరమంతా వాపులాగా వచ్చి ఉబ్బిపోయినట్టు కొందరు అప్పుడప్పుడు కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితి ఒక్కోసారి మనకు, లేదా మనకు తెలిసిన వారికి కూడా వస్తుంటుంది. అయితే అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? శరీరంలో నీరు ఎక్కువ అవడం వల్ల. అవును. మన శరీరంలో తగిన మోతాదు కన్నా నీరు ఎక్కువ అయితే అప్పుడు శరీరం ఉబ్బిపోయి కనిపిస్తుంది. మరి దీన్ని తగ్గించుకోవడమెలా అంటే, ఎలాంటి మందులు వాడాల్సిన పనిలేదు. కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన టిప్స్ పాటిస్తే చాలు. శరీరంలో ఎక్కువగా ఉన్న నీరంతా ఇట్టే బయటికి పోతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఉప్పు ఎక్కువగా తింటే అందులో ఉన్న సోడియం శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే చాలు. శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది.
శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటికి పంపించడంలో విటమిన్ బి6 బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విటమిన్ ఎక్కువగా ఉన్న పిస్తా పప్పు, చేపలు, అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే నీరు అంతా బయటికి పోతుంది. పొటాషియం కూడా అధిక నీటిని శరీరం నుంచి పంపించడంలో మెరుగ్గానే పనిచేస్తుంది. అరటి పండ్లు, అవకాడోలు, బీన్స్, పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది. నట్స్, ఆకుపచ్చని కూరగాయల వంటి మెగ్నిషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నా ఒంట్లో ఉన్న నీరు బయటికి పోతుంది. ప్రధానంగా వీటిని మహిళలు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.
నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా ఒక్కోసారి శరీరం ఉబ్బిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని కూడా తగిన మోతాదులో నిత్యం తాగాల్సిందే. చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. లేదంటే అవి మన శరీరంలో నీటిని అధికంగా నిల్వ చేస్తాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో నిల్వ అయ్యే అధిక నీటి సమస్య నుంచి బయట పడవచ్చు. జీలకర్రను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నా అధిక నీరు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతుంది. సింహదంతి (Dandelion) అని పిలవబడే మొక్క ఆకులను తింటున్నా ఒంట్లో అధిక నీటి సమస్య నుంచి బయట పడవచ్చు.