మేక మాంసం మరియు గొర్రె మాంసం రెండూ పోషకాల పరంగా విలువైనవే అయినప్పటికీ వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, వాటిని ఆధారంగా ఆరోగ్యానికి ఏది మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు. మేక మాంసం లో కొవ్వు స్థాయి తక్కువగా ఉంటుంది, తద్వారా హృదయ ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ అందుతుంది. ఇతర మాంసాలతో పోలిస్తే మేక మాంసం లో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది.
గొర్రె మాంసం కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది రుచికి బాగా ఉంటుందేమో గానీ కొవ్వు అధికమైన వారి ఆరోగ్యానికి మంచిది కాదు. గొర్రె మాంసం ఎక్కువ శక్తిని అందిస్తుంది. కొవ్వు అధికంగా ఉండడం వల్ల కొంతమందికి సమస్యగా మారవచ్చు. అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండె సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
ఏది ఆరోగ్యానికి మంచిది ? ఏది మంచిది అనేది మీ ఆరోగ్య లక్ష్యాలు మరియు వ్యక్తిగత రుచిపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడం లేదా గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే మేక మాంసం ఎక్కువ ఆరోగ్యకరమైనది. శక్తి అవసరం ఎక్కువగా ఉన్నవారు లేదా శీతాకాలంలో ఎక్కువ కేలరీలు అవసరమై ఉంటే గొర్రె మాంసం ఉపయుక్తంగా ఉంటుంది. మృదువుగా ఉండాలనుకుంటే గొర్రె మాంసం మంచి ఎంపిక. బలమైన రుచి కావాలనుకుంటే మేక మాంసం మంచి ఎంపిక. మొత్తంగా చూస్తే ఆహారపు అవసరాలు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి మేక లేదా గొర్రె మాంసాన్ని ఎంచుకోవచ్చు. మోతాదును పరిమితంగా ఉంచడం, తక్కువ మసాలాలతో వండడం ఆరోగ్యానికి మరింత మంచిది.