ఈ భువిపై వెలసిన సుందరవనంగా ఓ పల్లె రూపుదిద్దుకుంది. ఎక్కడ చూసినా పచ్చదనం..పుష్కలంగా నీళ్లు..కనిపించని చెత్తా చెదారం..విశాలమైన రోడ్లు..అందమైన భవనాలు. అవినీతి, అక్రమాలకు తావులేని పారదర్శకమైన పాలనకు కేరాఫ్‌గా విరాజిల్లుతోంది తురుత్తిక్కర. ఆకుపచ్చని పల్లెగా పేరు తెచ్చుకుంది..ఈ గ్రామం. ఇండియాలోని కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆ రాష్ట్రం ఇటీవలే పచ్చదనం..ప్రకృతికి ప్రతిరూపంగా నిలిచిన ఈ పల్లెను పూర్తి పచ్చదనంతో కూడిన గ్రామంగా ప్రకటించింది. పురస్కారం అందజేసింది. ఈ ఊరు నిండా పచ్చదనం అలుముకుంది. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. విశిష్టమైన దేవాలయాలు ఇక్కడ కొలువై వున్నాయి. గ్రీన్ విలేజ్ గా పేర్కొనడంతో దేశం మొత్తం ఈ పల్లె వైపు చూస్తోంది.
అప్పట్లో హరిత కేరళం మిషన్ వైస్ ఛైర్మన్..చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా టి.ఎన్.సీమ ఉన్నారు. తురుత్తిక్కర సాధించిన ఘన విజయాన్ని..పచ్చదనాన్ని మెచ్చుకున్నారు. ప్రశంసలతో ముంచెత్తారు. గ్రామ పంచాయతీ చేసిన ఈ ప్రయత్నం రాష్ట్రంలోని గ్రామాలకు ఆదర్శం కావాలని అభిలషించారు. కేరళ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఏటా ఈ రంగం ద్వారానే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. దీంతో విదేశీ పర్యాటకులను, టూరిస్టులను ఆకర్షించేందుకు సకల సౌకర్యాలను కల్పిస్తోంది. వరదలు ముంచెత్తినా, తుఫాన్లు దాడి చేసినా తట్టుకుని నిలబడ్డారు. ఇంత విపత్తు సంభవించినా చెక్కు చెదరలేదు..బెదరలేదు..ఈ గ్రామానికి చెందిన ప్రజలు.
ఊర్జా నిర్మల హరిత గ్రామంగా తురుత్తిక్కర కు నామకరణం చేశారు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఊరును ప్రశంసించింది. మూడు నెలల కాలంలో పల్లెను పరుచుకున్న పచ్చదనం చూసి స్వచ్ఛంద సంస్థలు, వివిద రాజకీయ పార్టీలు, విదేశీ పర్యాటకులు ఈ గ్రామానికి క్యూ కట్టారు. వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎఫీసియన్సీ, గ్రామస్తుల మధ్య సహకార సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతులు, మహిళలతో సంఘాలను ప్రోత్సహించారు. ప్రకృతి కొలువు తీరినట్టుగా ఈ పల్లె రూపుదిద్దుకుంది. ఈ ఊర్లో 349 కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అన్ని కుటుంబాలను అక్షరాస్యులుగా మార్చేశారు. ఎవ్వరూ అక్కడ చదువుకోని వారు లేరు.
కొచ్చిన్ యూనివర్శిటీ ఇపుడు తురుత్తిక్కర గ్రామవాసులకు విద్యాదానం చేసింది. గ్రామానికి అంతా శుద్ధమైన నీటిని సరఫరా చేస్తోంది. న్యూ టెక్నాలజీ ఆధారంగా నీరందుతోంది. ఏది మంచి నీరు కాదో టెస్టింగ్ చేసే నైపుణ్యాన్ని ఈ గ్రామస్థులు శిక్షణ పొందారు. వారంతకు వారే మంచి నీరు వచ్చేలా కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శుద్ధనీరు అందించే వాటర్ ప్లాంట్, మందులు లేని కూరగాయలు, విత్తనాలు, తక్కువ ఖర్చు ..ఎక్కువ వెలుగును ఇచ్చే లెడ్ బల్బులు, బయోగ్యాస్ ప్లాంట్లు, ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగులు, సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ కుక్కర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించు కోవడంతో పాటు మిగిలిన వాటిని సేల్ చేస్తూ ఆదాయం గడిస్తున్నారు ఇక్కడి గ్రామస్థులు. రూరల్ టెక్నాలజీ సెంటర్‌గా తురుత్తిక్కర ఇపుడు పేరు తెచ్చుకుంది..ఈ ఊరు. ఈ పల్లెను చూసైనా మన తెలుగు రాష్ట్రాల గ్రామాలు, తాండాలు బాగు పడితే బావుంటుంది కదూ..