మానవ శరీరమంటేనే అనేక విచిత్రాలకు నిలయం. కణాలు, కణజాలాలు, అవయవాలు, గ్రంథులు, నాడులు… ఇలా చెప్పుకుంటూ పోతే దేహంలో ప్రతీదీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. సైంటిస్టులు కూడా మానవ దేహం గురించి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటి విషయాల గురించే. అయితే అవేమీ కొత్తవి కావు. చాలా కాలం నుంచి ఉన్నవే. కానీ వాటన్నింటినీ చేయగలిగిన వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో దాదాపుగా ఎవరూ లేరట. వాటిలో ఏదో ఒక దానికి సంబంధించిన దాంట్లో మాత్రమే కొందరు ప్రావీణ్యులుగా ఉన్నారు. కానీ అన్నింటినీ ఎవరూ చేయలేరట. ఇంతకీ ఆ విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. కనుబొమ్మలను పైకి లేపడం… ఒక కనుబొమ్మను అలాగే ఉంచి మరో కనుబొమ్మను పైకి లేపడం దాదాపుగా చాలా మంది చేస్తారు. కొందరికి కేవలం ఒక కనుబొమ్మ మాత్రమే పైకి లేస్తే కొందరికి రెండూ పైకి లేస్తాయి. ఇలాంటి వారు చాలా తక్కువ మందే ఉంటారట.
మోచేతులను నాలుకతో అందుకోవడం… మోచేతులను నాలుకతో దాదాపుగా ఎవరూ అందుకోలేరట. ఇలాంటి వారు చాలా చాలా తక్కువగా ఉంటారట. భుజాలు, వెన్నెముక బాగా సాగే గుణం ఉన్నవారికైతేనే ఇలా సాధ్యమవుతుందట. చెవులను కదిలించడం… దేహంలోని ఏ భాగాన్ని కదిలించకుండా రెండు చెవులను ఆడించడమనే క్రియను కూడా చాలా తక్కువ మందే చేయగలరట. నాలుకతో ముక్కను అందుకోవడం… ఈ భూ ప్రపంచంలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఇలా చేయగలరట. బాగా పొడవైన నాలుక ఉన్న వారికే ఇది సాధ్యమవుతుందట. మధ్యవేలిని అరచేతిలోకి మడవడం… మధ్యవేలిని అరచేతిలోకి మడిస్తే ఉంగరపు వేలు కదలలేదట. ఇలా చాలా మందికి అవుతుందట. కేవలం కొంత మంది మాత్రమే అలాంటి పొజిషన్‌లో రెండు వేళ్లను కదిలించగలరట. రెండు వేళ్లకు మధ్య అనుసంధానమయ్యే ప్రత్యేకమైన నాడుల వల్లే ఇలా జరుగుతుందట.
నాలుకను రోల్ చేయడం… నాలుక రెండు చివర్లను మధ్యలోకి మడవడం చాలా మందికి సాధ్యం కాదట. పలు రకాల జన్యువులతోపాటు వాతావరణంలో మార్పుల వల్లే కొందరికి ఇలా సాధ్యమవుతుందట. ఇలా చేయగలిగే వారిలో ఉండే జన్యువులు ఇతరుల జన్యువులను డామినేట్ చేస్తాయట. చక్కిలిగింతలు పెట్టుకోవడం… మనకై మనం స్వతహాగా చక్కిలి గింతలు పెట్టుకోలేమట. ఎందుకంటే అవి మనమే పెట్టుకున్నామని నాడులు గ్రహించి అందుకు విరుద్ధమైన సంకేతాలను మెదడుకు పంపుతాయట. అందుకే మనకు మనం గిలిగింతలు పెట్టుకుంటే మనకు ఏమీ అనిపించదు. కుడికాలుని తిప్పడం… గడియారం ముల్లు తిరిగే దిశలో కుడి కాలుని తిప్పుతూ కుడి చేత్తో 6 సంఖ్యను రాయడానికి ప్రయత్నిస్తే మనకు తెలియకుండానే కుడి కాలు దిశ మారుతుందట. కావాలంటే మీరూ ట్రై చేయండి. అయితే అలా కుడి కాలు దిశ మారకుండా 6 సంఖ్యని ఎవరూ రాయలేరట.
శ్వాస బిగబట్టి ఉండడం… ఏ వ్యక్తి అయినా తన శ్వాసను బిగబట్టి తనను తాను చంపుకోలేడట. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో ఉండే ఓ ప్రత్యేకమైన స్వభావం వల్ల వెంటనే శ్వాస వదలడమో, తీసుకోవడమో చేస్తారట. దీంతో శ్వాసక్రియ మళ్లీ సాధారణ స్థితికి వస్తుందట.