Anna Prasana : మనం సాధారణంగా చిన్న పిల్లలకు అన్నప్రాసన చేస్తూ ఉంటాం. ప్రస్తుత కాలంలో దీనిని కూడా చాలా పెద్ద వేడుకగా చేస్తున్నారు. అయితే ఈ అన్న ప్రాసనను ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదని పండితులు చెబుతున్నారు. పిల్లలకు అన్న ప్రాసన చేయడం వెనుక కూడా ఒక అర్థం పరమార్థం ఉందని వారు చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఐదవ నెల నిండి ఆరవ నెల వచ్చిన తరువాత 5 వ రోజున అన్న ప్రాసన చేయాలని శాస్త్రం చెబుతుంది. అలాగే అన్నప్రాసనను అమ్మాయి పుట్టింట్లో అనగా మేనమామ ఇంట్లో చేయాలి. ఆవు పాలు లేదా పెరుగు, తేనె, నెయ్యి, అన్నంతో పరమానాన్ని వండి సిద్దం చేసుకోవాలి.
తరువాత క్రిమి కీటకాలు లేని, బలాన్ని కలిగించే , అలాగే పది మందికి పెట్టేలా ఉండే అన్నాన్ని ప్రసాదించమని మంత్రాలను చదువుతూ ఈ పరమానాన్ని ముందుగా దైవానికి నైవేధ్యంగా సమర్పించాలి. తరువాత దీనిని పిల్లలకు తినిపించాలి. ఇలా వండిన పరమానాన్ని వెండి పల్లెంలో తీసుకుని బంగారు ఉంగరం లేదా చెంచాతో పిల్లలకు మూడు సార్లు ముందుగా పెట్టాలి. తరువాత చేత్తో తినిపించాలి. ఈ పరమానాన్ని తల్లి ఒడిలో కూర్చున్న శిశువుకు ముందుగా శిశువు తండ్రి తినిపించాలి. తరువాత తల్లి తరుపు వారైన మేనమామ, అమ్మమ్మ, తాతయ్య వాళ్లు తినిపించాలి. అన్నప్రాసన్న చేయడం వల్ల శిశువుకు గర్భంలో ఉండగా వచ్చే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శిశువు గర్భంలో ఉండగా ఉమ్మతీరు తాగుతుంది. అలాగే విసర్జించిన మల మూత్రాలను కూడా తాగాల్సి వస్తుంది.
ఇలా రకరకాల పదార్థాలను తీసుకోవడం వల్ల వచ్చే దోషాలన్నీ కూడా అన్నప్రాసన చేయడం వల్ల తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఐదు నెలల సమయంలో పిల్లలకు నోటి నుండి చొంగ కారుతుంది. అలాగే మాట్లాడనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చొంగ కారుతుందంటే పిల్లలకు త్వరలో దంతాలు వస్తాయని అర్థం. అనగా పిల్లలకు మనం పిండి పదార్థాలు అందించాల్సిన సమయం వచ్చిందని శరీరం తన ధర్మాలను తెలియజేస్తుంది. పిండి పదార్థాలను, మాంసకృత్తులను పిల్లలకు బయట నుండి అందించాలి. పిల్లల్లో చొంగ కారడం చూడగానే అన్నప్రాసన చేయాల్సిన సమయం అన్నమైందని మన పెద్దలు చెబుతుంటారు. ఈ విధంగా అన్నప్రాసన వెనుక కూడా ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయని దీనిని కూడా శాస్త్రం ప్రకారం చేయాలని పండితులు చెబుతున్నారు.