వారం.. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులు. వీటి వెనుక అనేక ఖగోళ రహస్యాలు, ప్రకృతి సంబంధ విషయాలు దాగి ఉన్నాయి. ఒక్కో వారం వెనుక ఒక్కో గ్రహాధిపతి ఉంటారు. అయితే ఈ వారం రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసుకుందాం. కొందరికి కొన్ని రంగులు అంటే ఇష్టం. ఆ రంగులను ఎక్కువగా వాడుతారు. దీనినే కలర్ సైన్స్ అంటారు. ఇక జ్యోతిషం ప్రకారం ఆయా రోజులకు అధిపతుల ప్రకారం ఆయా రంగుల దుస్తులను ధరిస్తే మనకు గ్రహానుగ్రహం లభించడమే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి.
ఆదివారం నాడు సూర్యహోరలో సూర్యోదయం జరుగుతుంది. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి. లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి. మంగళవారానికి కుజుడు అధిపతి. మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు లేదా ఎరుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
వారంలో మూడవ రోజు బుధవారం బుధుడు అధిపతి. ఈ రోజు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించాలి. లేదా లేతపసుపు రంగు దుస్తులను ధరించాలి. గురువారం అధిపతి బృహస్పతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం అధిపతి శుక్రుడు. ఈ గ్రహానికి ప్రతీక తెలుపు రంగు. కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది లేదా ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.
శనివారంకు అధిపతి శని కాబట్టి ఆయనకు ప్రీతికరమైన నీలిరంగు దుస్తులను వాడాలి. దీని వల్ల శని అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఎవరికి వీలైన దుస్తులు వారు ధరిస్తే మంచిది. అదేవిధంగా గ్రహచారం లేదా గోచారం ప్రకారం ఏ గ్రహాల స్థితి బాగాలేదో ఆ గ్రహాలకు సంబంధించిన వారాలలో ఆయా రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.