గంగానది….. హిందువుల మతం, విశ్వాసం, స్వచ్ఛతలకు ప్రధాన సూచికంగా గంగానదిని భావిస్తారు. పురాతన కాలం నుండి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగానది జలాలను ఉపయోగిస్తున్నారు. కుటుంబంలో ఎవరు జన్మించినా, ఎవరైనా మృతి చెందినా గంగాజలాన్ని వారిపై చల్లితే పవిత్రులవుతారని విశ్వాసం. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్ళలో, దేవుడి గుడిలో పెట్టుకొని పవిత్రమైనది భావిస్తారు. ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవ్వదంటారు. ఈ నీటిని తీసుకోవడం వలన పాపాలు చేసినవారికి మోక్ష ప్రదానం లభిస్తుంది. మరణించే సమయంలో గంగాజలాన్ని తీసుకోవడం వల్ల స్వర్గానికి వెళ్తారని ప్రగాడ విశ్వాసం.
పూర్వీకుల నుండి గంగాజలాన్ని అమృతంగా భావిస్తున్నారు. గంగా నది తన సుదీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను అడువులలోని చెట్ల ద్వారా గ్రహిస్తుందంట. గంగానది పొడవు మొత్తం 2510 కి.మీ. కాగా, మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 శాతం ప్రజలకు ఈ గంగాజలం అందుతుంది. దేవుళ్ళు సైతం గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంగానదిలో స్నానం ఆచరించడం వలన మన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందని నమ్మకం.
మృత్యువుకు దగ్గరపడ్డప్పుడు గంగానదిని ఒంటిపై చల్లుకోవడం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. మరాణానంతరం అస్తికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల అభిప్రాయం. గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల పితృదేవతలు తరిస్తారట. పితృ దోషాలు తొలగిపోతాయట. పుట్టిన పిల్లలపై గంగాజలాన్ని చల్లటం ద్వారా ఎలాంటి రోగాలు వారివద్దకు దరిచేరవని నమ్మకం.