Suryakantham : గయ్యాళి అత్త పాత్రలతో తెలుగునాట తనదైన ముద్ర వేసిన సూర్యకాంతం ఎంతగా పాపులర్ అయిందంటే తమ ఇళ్లల్లో ఎవరికీ సూర్యకాంతం పేరు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతగా అందరి హృదయాలలో తన పాత్రలతో సూర్యకాంతం చెరగని ముద్రవేసుకుంది. 1994లో ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించినా ఇంకా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారు. అయితే సినిమాల్లో గయ్యాళి పాత్రలు వేసినప్పటికీ నిజ జీవితంలో ఆమె మనసు వెన్న అని అంటారు. అందరికీ స్వయంగా భోజనాలు, వంటకాలు చేసి తెచ్చి పెట్టేవారని అంటారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఆమె వంటను ఇష్టంగా తినేవారట.
సూర్యకాంతానికి ఆరేళ్ళ వయస్సు ఉండగానే తాతగారు చనిపోవడంతో పెద్ద అక్క, బావ దగ్గర పెరిగిందని సూర్యకాంతం కుమారుడు పద్మనాభ మూర్తి ఓ ఇంటర్యూలో చెప్పారు. సినిమాలో పాత్రలకు, నిజ జీవితానికి పొంతనలేదని, నిజంగా ఆమె సౌమ్యురాలని పేర్కొన్నారు. నారద నారది మూవీ ద్వారా 1946లో ఇండస్ట్రీకి వచ్చిన సూర్యకాంతం హీరోయిన్ గా చేయాలనుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఇక 1962 నాటి గుండమ్మ కథ మూవీతో గయ్యాళి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయింది.
ఎన్నో సినిమాల్లో తన నటనతో చెరగని ముద్రవేసిన సూర్యకాంతం పుస్తకాలను ఎక్కువ చదవడంలో దిట్ట. ఇక చేతికి ఎముక లేదన్నట్లు దాన ధర్మాలు చేసేవారని, చిన్న పత్రికలకు చేయూతనిచ్చేవారని పద్మనాభమూర్తి చెప్పుకొచ్చారు. శత్రువు అయినా సరే ఇంటికొస్తే ఆదరించి భోజనం పెట్టేవారట. ఇక ఆమెకు బ్లాక్ కలర్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఒకసారి బ్లూ కారు బుక్ చేస్తే.. బ్లాక్ కారు పంపడంతో గొడవపెట్టి మరీ మార్పించారట. ఇక పది భాషలను సూర్యకాంతం అనర్గళంగా మాట్లాడేవారట. సూర్యకాంతం కొడుకుగా చెప్పుకోడానికి గర్వంగా ఉంటుందని పద్మనాభ మూర్తి తెలిపారు.