వినోదం

సింహాసం మూవీకి పెట్టింది రూ.3.50 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. ఆయనే మన డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి. తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణనే. అందుకే ఈయనను నంబర్ వన్ హీరో అని పిలుస్తారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ అప్ప‌ట్లో ఎన్నో హిట్ చిత్రాలలో న‌టించారు. ముఖ్యంగా ఆయ‌న నటించిన హిట్ చిత్రాల్లో సింహాస‌నం సినిమా కూడా ఒక‌ట‌ని చెప్పాలి. ఈ చిత్రం విడుద‌లై దాదాపు 38 సంవ‌త్స‌రాలు గ‌డిచిన‌ప్ప‌టికీ ఇప్పటి త‌రంవారికి ఈ సినిమా గురించి అంత‌గా తెలియ‌క‌పోవచ్చు. ఈ సినిమా యొక్క ప్ర‌త్యేక‌త గురించి తెలిస్తే మాత్రం వెంట‌నే ఈ సినిమాను కచ్చితంగా చూస్తారు. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన ఈ సింహాస‌నం సినిమా ప్ర‌త్యేక‌త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

how are simhasanam movie collections

సింహాస‌నం సినిమాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిట‌ర్‌, హీరో అన్ని కూడా సూప‌ర్‌స్టార్ కృష్ణనే వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. ఈ చిత్రంలో కృష్ణ సరసన హీరోయిన్స్ గా జయప్రద మరియు మందాకిని నటించారు. అంతేకాకుండా తెలుగులో మొట్ట‌మొద‌టి 70 ఎం.ఎం. స్టీరియోఫొనిక్ సౌండ్ సినిమా కూడా ఈ చిత్రమేనట. ఈ సినిమా ప్ర‌త్యేక‌త గురించి సింపుల్‌గా చెప్పాలంటే 1980 దశాబ్దంలో ఈ సినిమా కూడా మ‌రో బాహుబ‌లి వంటి సినిమా అనే చెప్ప‌వ‌చ్చు. 1986 మార్చి 21న విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో కనక వర్షం కురిపించింది.

సింహాస‌నం చిత్రం విడుద‌లైన స‌మ‌యంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్ష‌కులు 12 కిలోమీట‌ర్ల మేర‌ క్యూలో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కృష్ణాజిల్లా విజ‌యవాడ రాజ్ థియేట‌ర్‌లో ఈ సినిమా విడుద‌లైన రోజున కిలోమీట‌ర్ల మేర‌కు లైన్‌లో జ‌నాలు క్యూ క‌ట్టార‌ట‌. అందుకే అప్పటిలో ఆ ప్రాంతంలో 144 సెక్ష‌న్ విధించారని స్వయానా సూప‌ర్ స్టార్ కృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో తెలియజేశారు. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించ‌డం కోసం 3.5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయగా.. దాదాపు 5 కోట్లు పైన వ‌సూలు చేసి రికార్డును సృష్టించింద‌ట‌. ఈ సినిమా 100 రోజుల ఫంక్ష‌న్ చెన్నైలో నిర్వ‌హించ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు 400 బ‌స్సుల‌తో అక్క‌డికి చేరుకున్నారట. అంటే ఇప్పటి సినిమాల‌తో పోల్చితే సింహాసనం సినిమా అప్పటిలోనే సెన్సేషనల్ రికార్డులను సృష్టించింది అని చెప్పవచ్చు.

Admin

Recent Posts