శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తుంటాయి. వేరే రోజుల కంటే కూడా శుక్రవారం రోజే సినిమాలను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు నిర్మాతలు. అయితే అసలు సినిమాలు ఆ రోజునే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ? తెలియకుంటే ఈ వార్త చదవాల్సిందే. ఇలా శుక్రవారాలలో సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 శుక్రవారం రోజున విడుదలైన గాన్ విత్ ద విండ్ సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. అదే కంటిన్యూ అవుతూ వస్తోంది.
ఆ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి శుక్రవారం సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా మారింది. ఇక మన దేశంలో అదేవిధంగా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా మొఘల్ ఎ అజమ్. ఈ మూవీ కూడా బంపర్ హిట్ అయి ఒక క్లాసికల్‌గా మిగిలింది. దీన్ని అప్పట్లో బ్లాక్ అండ్ వైట్‌లో రిలీజ్ చేయగా.. ఈ టెక్నాలజీ యుగంలో ఈ మూవీని కలర్‌లోనూ మార్చి మళ్లీ రిలీజ్ చేశారు. ఇక ఇందులోని పాటలను ఇప్పటికీ ఎంతో మంది వింటుంటారు. అప్పట్లో మొఘల్ ఎ అజమ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో అది సెంటిమెంట్ గా మారిపోయి మన దేశంలో శుక్రవారం సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి.
అంతే కాదు మన దేశంలో శుక్రవారం సినిమా విడుదలను ఎంచుకోవడానికి మరో కారణం ఉంది. అదేటంటే.. శుక్రవారం లక్ష్మీ దేవి రోజు. ఆ రోజు తమ సినిమాలని విడుదల చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మడం మొదలుపెట్టారు. మరొక కమర్షియల్ కారణం ఏంటంటే.. శుక్రవారం తరువాత వచ్చేది వీకెండ్. శని, ఆది వారాలు. దీంతో సహజంగానే ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తారు. కొత్త మూవీలు విడుదల అయి ఉంటే వాటిని చూసేందుకు ఆసక్తిని కనబరుస్తారు. దీంతో థియేటర్లు నిండిపోతాయి. మొదటి 3 రోజులు కలెక్షన్స్ బాగా వస్తాయి. దీంతో నష్టాల నుంచి చాలా వరకు గట్టెక్కవచ్చు. అందుకనే ఈ కారణాల చేతనే శుక్రవారం రోజునే సినిమాలను రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. అదే ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తోంది.