Walking : నిత్యం వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బరువు తగ్గుతారు. డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కండరాలు దృఢంగా మారుతాయి. ఇవే కాకుండా వాకింగ్ వల్ల ఇంకా మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీకు తెలుసా..? వాకింగ్ అంటే.. అందులో కేవలం ఒక రకమే కాదు.. మరో 6 రకాల వాకింగ్‌లు ఉన్నాయి. అవును, మీరు విన్నది కరెక్టే. మరి ఆ ఆరు రకాల వాకింగ్‌లు ఏమిటో, వాటి వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
సాధారణంగా మనం చేసే వాకింగ్‌నే కొంచెం ఫాస్ట్‌గా చేయాలి. అంటే పరుగులాంటి నడక అన్నమాట. అందుకే దానికి బ్రిస్క్ వాక్ అని పేరు వచ్చింది. ఇలా బ్రిస్క్ వాక్ చేయడం రన్నింగ్ చేసినంతటి ఫలితాన్ని ఇస్తుంది. క్యాలరీలు మరిన్ని ఎక్కువగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని చేయడం మంచిది. దీంతో కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. బ్రిస్క్ వాక్‌లో చేతులను బాగా ఊపుతూ మరింత ఎక్కువ వేగంతో చేసే వాక్‌నే పవర్ స్ట్రైడింగ్ అంటారు. దీని వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. మెటబాలిజం స్పీడ్ అవుతుంది. ఫలితంగా క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు త్వరగా తగ్గుతారు. శక్తి స్థాయిలు పెరుగుతాయి.
మెట్లపై ఎక్కడం, దిగడాన్ని స్టెయిర్‌వెల్ వాక్ అంటారు. దీని వల్ల గంటకు 200కు పైగానే క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. కండరాలు బాగా దృఢంగా మారుతాయి. అయితే ఒకేసారి గంట సేపు చేయకుండా మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి చేస్తే దీని వల్ల మరింత సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చు. ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేయడాన్నే అప్‌హిల్ క్లైంబ్ అంటారు. దీని వల్ల తొడ కండరాలు, పిక్కలు దృఢంగా మారుతాయి. హామ్‌స్ట్రింగ్ గాయాలకు ఉపశమనం కలుగుతుంది. బయట వాకింగ్ చేయడానికి వీలు కాని వారు ట్రెడ్‌మిల్ వాకింగ్ చేయవచ్చు. ట్రెడ్ మిల్ మిషన్‌పై చేస్తారు కనుక దీనికి ట్రెడ్‌మిల్ వాకింగ్ అని పేరు వచ్చింది. దానిపై పలు సెట్టింగ్స్‌ను బట్టి బ్రిస్క్ వాక్‌ను కూడా చేయవచ్చు. దీంతో కూడా పైన చెప్పిన ఫలితాలు కలుగుతాయి.
సముద్రపు ఒడ్డున నీళ్లలో వాకింగ్ చేయడాన్ని పూల్ వాకింగ్ అంటారు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఆర్థరైటిస్, వెన్ను నొప్పి, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ఉన్నవారికి పూల్ వాకింగ్ చాలా మంచిది. ఇలా ఎవరైనా సరే తమకు ఉన్న అనుకూలతలను బట్టి వివిధ రకాలుగా వాకింగ్ చేయవచ్చు. ఎంతో మేలు జరుగుతుంది.