శరీరం అనుకున్న షేప్ కు రావాలన్నా, మంచి ధృఢత్వం కలిగి వుండాలన్నా జాగింగ్ మంచి వ్యాయామం. కేలరీలు ఖర్చవటమే కాదు శరీరం, మైండ్ అన్నీ ఆరోగ్యంగా వుంటాయి. రకరకాల వ్యాయామాలు చేసే కంటే జాగింగ్ చేస్తే చాలనుకుంటారు చాలామంది. అయితే, మంచి ఫలితాలనివ్వాలంటే జాగింగ్ చేసే విధానం తెలుసుకోండి. జాగింగ్ షూస్ వేసుకొని వెంటనే గ్రౌండ్ కు వెళ్ళిపోవటం కాదు. దానికి ముందు కొద్దిపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. జాగింగ్ తర్వాతే స్ట్రెచింగ్ చేయాలనే భావన దూరం చేయండి. ముందుగా స్ట్రెచింగ్ చేస్తే…అది బెణుకులను లేదా గాయాలను కలుగకుండా చేస్తుంది.
జాగ్ చేయాలంటే…ఉదయం వేళ మంచి సమయం. అది మీ జీవక్రియ పెంచి రోజంతా శక్తితో వుండేలా చేస్తుంది. జాగింగ్ బాగా చేయాలంటే, జాగింగ్ షూస్ వేసుకోండి. కొత్తగా మొదలు పెట్టినవారు ఆరంభంలో మెల్లగా నడిచి, నడక వేగం పెంచుతూ, క్రమంగా జాగింగ్ కు రావాలి. జాగింగ్ సమయంలో మూడ్ బాగా వుండాలంటే, మ్యూజిక్ వినండి. కొత్తగా జాగ్ మొదలు పెట్టేవారు ఎత్తు, పల్లాలు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి. కాళ్ళపై ఒత్తిడి లేకుండా వుంటుంది.
బెణుకులు వంటివి లేకుండా వుండాలంటే…మెల్లగా మొదలు పెట్టి క్రమేణా వేగం పెంచాలి. జాగింగ్ కు వెళ్ళే అరగంట ముందు నీరు తాగండి. శరీరం డీహైడ్రేషన్ పొందకుండా వుంటుంది. నీరు అధికంగా తాగితే, వేగం తగ్గుతుంది. ఫలితాలు బాగుండాలంటే, ఖాళీ పొట్టతో చేయండి. వేగం వచ్చి కేలరీలు బాగా తగ్గుతాయి. మునికాళ్ళపై జాగ్ చేయాలి కాని మడమలపై కాదు. జాగింగ్ చేసిన తర్వాత కూడా కొద్ది పాటి స్ట్రెచింగ్ చేయండి.