Omicron Symptoms : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోమారు అనేక దేశాలను బెంబేలెత్తిస్తోంది. అమెరికాలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ 10 లక్షలకు చేరుకుంది. మన దేశంలోనూ గత రెండు రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ పలు రాష్ట్రాల్లో ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే లాక్‌డౌన్ విధించే అవకాశాలను మళ్లీ పరిశీలిస్తున్నారు.
కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ రూపంలో వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే గత వేరియెంట్లతో పోల్చితే ఈ వేరియెంట్ భిన్న రకాల లక్షణాలను చూపిస్తోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన వారిలో చర్మం, పెదవులు, గోళ్ల రంగు మారుతోంది. వారి చర్మ రంగును బట్టి ఒమిక్రాన్ సోకిన వారి చర్మం, పెదవులు, గోళ్లు.. నీలి, బూడిద లేదా తెలుపు రంగులోకి మారుతున్నాయి. ఎవరిలో అయినా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై పరీక్షలు చేయించుకోవాలని, ఒమిక్రాన్ అని నిర్దారణ అయితే చికిత్స తీసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపిన ప్రకారం కోవిడ్ ఒమిక్రాన్ సోకిన వారిలో గత వేరియెంట్ల కన్నా భిన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి చర్మం, పెదవులు, గోళ్లు.. నీలం, బూడిద లేదా తెలుపు రంగులో కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. సాధారణంగా ఒమిక్రాన్ సోకిన తరువాత ఆక్సిజన్ లెవల్స్ తగ్గితేనే ఇలా ఆయా భాగాలు భిన్న రకాల రంగుల్లో కనిపిస్తాయని అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని హెచ్చరిస్తున్నారు.
ఇక ఒమిక్రాన్ వేరియెంట్‌కు చెందిన ఇతర లక్షణాల విషయానికి వస్తే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతిలో నిరంతరాయంగా నొప్పి, బరువు పెట్టినట్లు అనిపించడం, ఆందోళన, ఖంగారు, నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర లేవలేకపోవడం, విపరీతమైన అలసట, నీరసం.. వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని, చాలా మందికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం లేదని సౌతాఫ్రికాకు చెందిన మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ ఆంజెలిక్ కొయెట్జి తెలిపారు. అలాగే గత వేరియెంట్లు సోకిన వారిలో ఉన్న రుచి, వాసన కోల్పోవడం వంటివి ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించడం లేదన్నారు. కానీ గొంతులో నొప్పి, దురద వంటివి ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపిస్తున్న లక్షణాలు అని స్పష్టం చేశారు. కాబట్టి ఈ లక్షణాలతోపాటు పైన తెలిపిన విధంగా లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.