food

Chicken Fry Piece Pulao : చికెన్ ఫ్రై పీస్ పులావ్.. ఇలా చేస్తే రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది.. టేస్ట్ అదిరిపోద్ది..!

Chicken Fry Piece Pulao : చికెన్‌తో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ క‌ర్రీ, ఫ్రై, బిర్యానీ.. ఇలా అనేక వెరైటీల‌ను మనం చికెన్‌తో త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే చికెన్ పులావ్ అంటే కూడా చాలా మందికి ఇష్ట‌మే ఉంటుంది. ముఖ్యంగా చికెన్ ఫ్రై పీస్ పులావ్ అంటే చాలా మంది ఆస‌క్తిగా తింటారు. కానీ దీన్ని హోట‌ల్‌లో మాత్ర‌మే తిన‌గ‌ల‌రు. ఇంట్లో త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. కానీ కింద సూచించిన విధంగా చేస్తే చికెన్ ఫ్రై పీస్ పులావ్ ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌స్తుంది. మ‌రి దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దాన్ని ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

చికెన్ ఫ్రై పీస్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ఒక కేజీ , నూనె – ఒక క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – రెండు క‌ప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్‌, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన ప‌చ్చి మిర్చి ముక్క‌లు – పావు క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్‌, ప‌సుపు – ఒక టీ స్పూన్‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్‌, ఉప్పు – రుచికి త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్‌, నీళ్లు – ఒక‌టిన్న‌ర లీట‌ర్‌.

chicken fry piece pulao how to make it

పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – 1 కేజీ , యాల‌కులు – 8, దాల్చిన చెక్క – 2 , ల‌వంగాలు – 8, మిరియాలు – అర టీ స్పూన్‌, జాజి పువ్వు – 3, జాప‌త్రి – 3, త‌రిగిన ప‌చ్చి మిర్చి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ల్ – ఒక టీ స్పూన్‌, పులావ్ మ‌సాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – స‌రిప‌డా.

చికెన్ ఫ్రై పీస్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా బాస్మ‌తి బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి ఒక గంట పాటు నాన బెట్టుకోవాలి. త‌రువాత బాస్మ‌తి బియ్యాన్ని ఉడికించ‌డానికి స‌రిప‌డే గిన్నెను తీసుకుని అందులో నూనె వేసి కాగాక నీళ్లు, ఉప్పు త‌ప్ప మిగిలిన పులావ్ ప‌దార్థాలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో బాస్మ‌తి బియ్యం ఉడ‌కడానికి కావల్సిన నీటి కంటే కొంచెం త‌క్కువ నీటిని పోసి ఉప్పు వేయాలి. ఈ నీళ్లు కాగాక బాస్మ‌తి బియ్యం వేసి 95 శాతం ఉడికించుకోవాలి. ఈ బాస్మ‌తి బియ్యం ఉడికిన త‌రువాత పొడిగా ఉండేలా చూసుకొని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక కుక్క‌ర్‌లో నీళ్లు పోసి శుభ్రంగా క‌డిగిన చికెన్ వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పులావ్ కు స‌రిప‌డా క‌ళాయిని లేదా గిన్నెను తీసుకుని నూనె వేసి కాగాక త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్క‌లు వేగాక చికెన్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి బాగా క‌లిపి మ‌రో 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ చికెన్ పై ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న పులావ్ ను వేసి కొద్దిగా నీళ్లు చ‌ల్లి మూత పెట్టుకోవాలి. బాస్మ‌తి బియ్యం పూర్తిగా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ పులావ్ త‌యార‌వుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది.

Admin

Recent Posts