మరుగుతున్న టీ పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాలకులు వేసి, టీ ఇస్తే చాలా రుచిగా ఉంటుంది. లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి. వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా.
వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, ఆ తర్వాత వీటిని వేయించండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోశలు వేస్తే నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి. సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.