కరోనా నేపథ్యంలో ప్రస్తుతం గత 8 నెలలుగా అనేక మంది ఇళ్ల నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం పేరిట చాలా మంది ఇళ్ల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. కానీ మెజారిటీ ఉద్యోగులు మాత్రం ఇంకా వర్క్ ఫ్రం హోం మోడల్‌లోనే పని చేస్తున్నారు. అయితే దీని వల్ల మరో కొత్త సమస్య వచ్చింది. కీళ్లు, మోకాళ్లు, వెన్ను, మెడ నొప్పుల బాధితులు ఈ 8 నెలల సమయంలో 70 శాతం పెరిగారు. దీంతో ఈ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం వెన్ను సమస్యల కోసం ఏర్పాటు చేసిన ది ఇండియన్ స్పైనల్ ఇంజురీస్ సెంటర్ (ఐఎస్ఐసీ) తెలిపిన వివరాల ప్రకారం గత 8 నెలల కాలంలో కీళ్లు, మోకాళ్లు, వెన్ను, మెడ నొప్పుల బాధితులు ఏకంగా 70 శాతం పెరిగారు. వారు ఆయా సమస్యల కారణంగా హాస్పిటల్‌కు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే వర్క్ ఫ్రం హోం వల్ల ఇళ్లలోనే గంటల తరబడి కంప్యూటర్లు ఎదుట కూర్చుని పనిచేస్తుండడం, మధ్య మధ్యలో విరామం ఇవ్వకపోవడం, సరైన భంగిమలో కంప్యూటర్ల ఎదుట కూర్చోకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాల వల్లే ఆయా బాధితుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు తేల్చారు. అలాగే ఆన్‌లైన్ తరగతుల పేరిట ఇంట్లో కంప్యూటర్లు, ఇతర గ్యాడ్జెట్లను ఉపయోగిస్తున్న విద్యార్థుల్లో కూడా ఆయా నొప్పుల సమస్యలు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇక ఇప్పటికే ఆయా సమస్యలు ఉన్నవారికి అవి మరింత తీవ్రతరం అయ్యాయని వైద్యులు తెలిపారు. దీంతో ఇటీవలి కాలంలో వెన్ను, కీళ్లకు సంబంధించిన శస్త్ర చికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అయితే ఆ సమస్యల నుంచి బయట పడాలంటే ఉద్యోగులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కంప్యూటర్ల ఎదుట సరైన భంగిమలో కూర్చోవడం, మధ్య మధ్యలో పనికి కాస్త విరామం ఇవ్వడం, నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి పాటిస్తే నొప్పుల సమస్యలు ఉండవని అంటున్నారు. అలాగే చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ముందు తెలిపిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.