యూకేలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం జనాలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా యూకే అన్ని విమానాలను నిలిపివేసింది. అయినప్పటికీ కొందరు యూకే వచ్చిన వారికి కోవిడ్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటి వరకు కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌కు సంబంధించిన జాడలను భారత్‌లో గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే కొత్త కోవిడ్ స్ట్రెయిన్ లక్షణాలను కూడా వైద్యులు చెబుతున్నారు. అవేమిటంటే…
* దగ్గు నిరంతరాయంగా వస్తుంటుంది.
* ఛాతి నొప్పి, జ్వరం ఉంటాయి.
* రుచి చూడడం, వాసన పసిగట్టడం కోల్పోతారు.
* తలనొప్పి ఉంటుంది.
* అలసటగా ఉంటుంది.
* కండరాల నొప్పులు ఉంటాయి.
* విరేచనాలు కావచ్చు.
* ఆందోళన, కంగారు ఉంటాయి.
ఇక వీటితోపాటు పాత వైరస్ లక్షణాలు కూడా కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ఉన్నవారిలో కనిపిస్తాయి. అయితే కొత్త కోవిడ్ వైరస్ పాతదాని కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, శరీర రోగ నిరోధక వ్యవస్థపై వేగంగా దాడి చేస్తుందని, అందువల్ల పాత వైరస్ కన్నా కొత్త వైరస్ ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ భయపడాల్సిన పనిలేదని, పాత వైరస్‌లాగే దీనికీ అదే చికిత్స తీసుకోవచ్చని, అయితే వ్యాక్సిన్ కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందా, లేదా.. అన్న విషయాలను ఇప్పుడే చెప్పలేమని సైంటిస్టులు అంటున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త కోవిడ్ స్ట్రెయిన్ నేపథ్యంలో మరింత అప్రమత్తం అయ్యాయి. యూకే నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేసి వారిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచాలని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారికి టెస్టులు చేసి కోవిడ్ ఉందీ, లేనిదీ నిర్దారించుకోవాలని, కోవిడ్ పాజిటివ్ అయితే కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించేందుకు బాధితుల శాంపిళ్లను టెస్టింగ్‌కు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించాయి. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.