ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా చలికాలం వచ్చింది. కానీ ఈసారి చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. దీంతో జనాలు వేడి వేడి టీ, కాఫీలు, కారంగా ఉండే హాట్ సూప్‌లు, మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలను తింటూ శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు తక్కువవుతున్న కొద్దీ మనకు వైరస్‌లు, బాక్టీరియాల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతుంటాయి. అందువల్ల ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే బెల్లం లాంటి పదార్థాలను ప్రస్తుతం తీసుకోవాలి. దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
చలికాలంలో బెల్లంను తినడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. అవి రాకుండా ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ఊపిరితిత్తులకు కావల్సిన వేడి లభిస్తుంది. దీంతోపాటు గొంతులో ఇన్‌ఫెక్షన్లు, ఇర్రిటేషన్ తగ్గుతాయి.
వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు సహజంగానే బలహీనంగా మారుతుంటాయి. దీంతో ఎముకలు డొల్లగా మారి నొప్పులు వస్తాయి. కీళ్లల్లో నొప్పులు కలుగుతుంటాయి. అయితే బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీంతో ఆర్థరైటిస్ సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.
ఆస్తమా ఉన్నవారికి చలికాలంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. చలి తీవ్రత పెరిగే కొద్దీ ఆస్తమా కూడా మరింత తీవ్రతరమై సమస్యలను సృష్టిస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ సీజన్‌లో నిత్యం బెల్లంను తినాలి. బెల్లంలో యాంటీ అలెర్జిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఆస్తమా అటాక్‌లు రాకుండా చూస్తాయి.
ఈ సీజన్‌లో వ్యాధులు రాకుండా ఉండాలంటే శరీర రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అందుకు గాను బెల్లం ఎంతగానో ఉపకరిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శక్తి వస్తుంది. అలాగే శరీరంలో వ్యాధులను, ఇన్‌ఫెక్షన్లను కలిగించే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి.
నిత్యం బెల్లంను తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. అందులో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి. బెల్లంలో ఉండే అనేక పోషకాలు ప్రధాన అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. అలాగే శరీరంలోని విష పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి.
హైబీపీని తగ్గించగలిగే సామర్థ్యం బెల్లంకు ఉంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. బెల్లంలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. నిత్యం బెల్లంను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం రసం, కొంత బెల్లం వేసి బాగా కలిపి ఆ నీటిని తాగితే వెక్కిళ్ల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు అసౌకర్యం, ఇర్రిటేషన్ తగ్గుతాయి.
చలికాలంలో సహజంగానే చర్మం పగులుతుంటుంది. దాన్ని నివారించాలంటే నిత్యం బెల్లంను తీసుకోవాలి. ఈ క్రమంలో చర్మం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.