క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వ‌లేదు.. ఇంగ్లండ్‌లో భ‌య‌పెడుతున్న నోరోవైర‌స్.. ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టించిన క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వలేదు. ఇప్ప‌టికీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంది. అంద‌రూ టీకాలు వేయించుకుంటే గానీ ఈ వైర‌స్ అంత‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇంకో కొత్త వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ పేరిట ఇంకో వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. గ‌త 5 రోజుల్లోనే ఈ వైర‌స్ అక్క‌డ 3 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందింది.

norovirus spreads across england these are the symptoms

ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ కేసుల సంఖ్య గ‌త 5 రోజులుగా పెరుగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ 154 నోరోవైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. ఈ వైర‌స్ క‌లుషిత ఆహారాలు, ద్ర‌వాల‌ను తీసుకుంటే వ‌స్తుంద‌ని నిర్దారించారు. ఈ క్ర‌మంలోనే నోరో వైర‌స్ బారిన ప‌డిన వారిలో ప‌లు లక్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నోరో వైర‌స్ బారిన ప‌డిన వారిలో తీవ్ర‌మైన డీహైడ్రేషన్ స‌మ‌స్య వ‌స్తుంది. స‌డెన్‌గా వికారం, అత్య‌ధిక జ్వ‌రం, తీవ్ర‌మైన క‌డుపునొప్పి, కాళ్ల‌లో నొప్పులు, నిరంత‌రాయంగా వాంతులు, విరేచ‌నాలు అవుతుంటాయి.

సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ చెబుతున్న ప్ర‌కారం.. నోరో వైర‌స్ 3 ర‌కాలుగా వ్యాప్తి చెందుతుంది. అప్ప‌టికే వైర‌స్ వ్యాప్తి చెందిన వారిని నేరుగా తాక‌డం వ‌ల్ల లేదా క‌లుషిత‌మైన ఆహారాలు, ద్ర‌వాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల లేదా అప‌రిశుభ్రంగా ఉన్న‌, వైర‌స్ సోకిన ఉప‌రిత‌లాల‌ను ట‌చ్ చేయ‌డం వ‌ల్ల ఈ వైర‌స్ వ‌స్తుంద‌ని నిర్దారించారు. అందువ‌ల్ల కోవిడ్ లాంటి జాగ్ర‌త్త‌ల‌నే ఈ వైర‌స్‌కు కూడా తీసుకోవాల్సి ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

అయితే కోవిడ్ సోకిన వెంట‌నే ల‌క్ష‌ణాలు మ‌రీ తీవ్రంగా ఉండ‌వు. క‌నీసం 2-3 రోజులు అయినా ప‌డుతుంది. కానీ నోరో వైర‌స్ అలా కాదు, వ్యాప్తి చెందిన వెంట‌నే తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి.

నోరో వైర‌స్ వ్యాప్తి చెందాక శ‌రీరంలో వాపుల‌ను క‌లిగిస్తుంది. ముఖ్యంగా చిన్న పేగుల్లో వాపులు వ‌స్తాయి. దీన్నే గ్యాస్ట్రో ఎంట‌రైటిస్ అంటారు. ఈ వైర‌స్ సోకిన వ్య‌క్తి నుంచి వైర‌స్ అణువులు కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. కానీ కేవ‌లం కొన్ని మాత్ర‌మే ఇత‌రుల‌కు వ్యాప్తి చెందుతాయి. అందువ‌ల్ల కోవిడ్ లాంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఈ వైర‌స్ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వచ్చు.

కోవిడ్ 19, నోరో వైర‌స్ రెండింటిలోనూ కొన్నిల‌క్ష‌ణాలు కామ‌న్‌గా ఉంటాయి. జ్వ‌రం, పొడిద‌గ్గు, త‌ల‌నొప్పి, వికారం, వాంతులు, విరేచ‌నాలు.. వంటివి రెండింటిలోనూ కామ‌న్‌గా క‌నిపిస్తాయి. అయితే ఇత‌ర ల‌క్ష‌ణాల‌ను గుర్తించ‌డం ద్వారా రెండింటిలో ఏ వైర‌స్ సోకిందీ నిర్దారించవ‌చ్చు. దీంతో వ్యాప్తి చెందిన వైర‌స్‌కు అనుగుణంగా చికిత్స‌ను అందించేందుకు వీలు క‌లుగుతుంది.

Admin

Recent Posts