దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రజలకు రోజూ పెద్ద ఎత్తున టీకాలను ఇస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలను అందిస్తోంది. అయితే టీకాలను తీసుకునేవారికి అనేక అనుమానాలు వస్తున్నాయి. టీకాలను తీసుకోవాలా, వద్దా అని సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ టీకాలను తీసుకుంటే సంతాన లోపం సమస్య వస్తుందేమోనని చాలా మంది భయ పడుతున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టతను ఇచ్చింది.
కోవిడ్ టీకాలను తీసుకుంటే సంతాన లోపం సమస్య వస్తుందని అనేక మంది ప్రజలు భయపడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో వివరాలను ఉంచింది. కోవిడ్ టీకాలు పూర్తిగా సురక్షితమని, వాటిని తీసుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని, ముఖ్యంగా సంతాన లోపం సమస్య అసలే రాదని, అలా వస్తుందని చెబితే నమ్మకూడదని తెలిపింది. కోవిడ్ టీకాలు పూర్తిగా సురక్షితమేనని, ఏ టీకాను తీసుకున్నా సంతాన లోపం ఏర్పడదని స్పష్టం చేసింది. కనుక టీకాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని తెలిపింది.
ఇక ఇటీవలే గర్బిణీలు, పాలిచ్చే తల్లులు కూడా టీకాలు తీసుకోవచ్చని నిపుణులు తెలిపారు. ఈ విషయంపై కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. టీకాలను ఎవరైనా తీసుకోవచ్చని, ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడవని తెలిపింది.
ఒకప్పుడు పోలియా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కూడా చాలా మంది భయ పడ్డారు. ఆ వ్యాక్సిన్ తో ప్రాణాలు పోతాయేమోనని అనుమానించారు. కానీ అన్ని రకాలుగా పరీక్షించిన తరువాతే టీకాలను విడుదల చేస్తారు కనుక ఈ విషయంలో ఎలాంటి అపోహలు, అనుమానాలకు గురి కావల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365