ఛాయ్, కాఫీ.. ఈ రెండింట్లో ఏదో ఒకటి తాగి తీరాల్సిందే. అయితే ఈ రెండింట్లో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? అనే దానిపై దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. కొందరు ఛాయ్కు ఓటేస్తే మరికొందరు కాఫీకి జై కొడతారు. అయితే కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ పరిశోధకులు. వారు రోజూ మూడు కప్పుల కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఓ అధ్యయనం చేశారు.ఈ అధ్యయనంలో ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ తాగుతున్న వారిలో (200-300 మిల్లీగ్రాముల కెఫిన్) గుండె సంబంధిత సమస్యలతో పాటు, స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఫ్యాటీ లివర్ వ్యాధులు వృద్ధి చెందే ముప్పును 40-48 శాతం తగ్గినట్లు గమనించారు.
కాఫీలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ కాఫీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.టీ కంటే కాఫీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కప్పు కాఫీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే డైలీ కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇంకా కాలేయం, ప్రోస్టేట్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధుల రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టీ లేదా కాఫీ ఏది మంచిది అంటే.. ఇది మీ వ్యక్తిగత ఎంపిక అని చెప్పవచ్చు. కానీ ఈ రెండింటిని అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హానికరం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రెండింటినీ చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీ లేదా ఒకటి నుంచి రెండు కప్పుల టీ తాగడం మంచిది. ఇంతకు మించి తాగితే ఆరోగ్యానికి హానికరం.ఆరోగ్యపరంగా రెండింటిలో కూడా చాలా రకాల హెల్త్ బెన్‌ఫిట్స్ ఉన్నాయి. అయితే, వీటిని ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.