Anasa Puvvu : మనం వంటింట్లో అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాము. మనం వంటల్లో వాడే మసాలా దినుసులు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాంటి మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. దీనిని బిర్యానీ, పులావ్ వంటి వాటిల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనినే స్టార్ అనిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అనాస పువ్వులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అనాస పువ్వులో ఉండే ఔషధ గుణాల గురించి దీనిని వాడడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనాస పువ్వు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఎంతో దోహదపడుతుంది. కడుపులో వికారం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో అనాస పువ్వు సమర్థవంతంగా పని చేస్తుంది.
మనం తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడంలో అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో కూడా అనాస పువ్వు సహాయపడుతుంది. స్త్రీలల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తగ్గించి చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. అనాస పువ్వులను ఉపయోగించడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ లతో బాధపడే వారు అనాస పువ్వును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అనాస పువ్వులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వైరస్, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. అనాస పువ్వులో థైమోల్, టెర్పినోల్ అనే రసాయన సమ్మేళనాలు ఉన్నాయి.
ఇవి దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు కారణరమయ్యే బ్యాక్టీరియాను నశింపజేయడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా అనాస పువ్వు మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనాస పువ్వు మనకు ఎంతగానో సహాయపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.