Bad Habits : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మన శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో చాలా మంది సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడుతున్నాయి. శరీరంలో జీవక్రియల రేటు తగ్గుతుంది. యుక్త వయసులోనే అనేక రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. అలాగే చాలా మంది గంటల తరబడి ఫోన్ చూస్తూ గడిపేస్తూ ఉంటారు. ఇది మన మెదడుపై, కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక మనం మన జీవన విధానంలో, ఆహారపు అలవాట్లల్లో చాలా మార్పులు చేసుకోవాలి. లేదంటే మనం తీవ్ర అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. మనం మన జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి.. ఎలాంటి ఆహారాలను తీసుకోవాలని అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఒత్తిడి, ఆందోళనల కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. తగినంత నిద్రలేకపోవడం కూడా మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆహారం, నీరు మన శరీరానికి ఎంత అవసరమో నిద్ర కూడా మన శరీరానికి అంతే అవసరం. నిద్రలేమి కారణంగా మనం మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే తగినంత నిద్రలేకపోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అలసట, నీరసం మన దరి చేరుతాయి. కనుక రోజూ తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. ఫోన్స్, టీవీలు చూడడం తగ్గించి రోజూ కనీసం 7 నుండి 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక టీ, కాఫీలను తక్కువగా తీసుకోవాలి. వీటికి బదులుగా ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్, గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చాలా మంది రోజూ కనీసం రెండు లీటర్ల నీటిరని కూడా తాగరు. కానీ నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. శరీరంలో మలినాలుపేరుకుపోయి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. కనుక రోజూ కనీసం 12 నుండి 16 గ్లాసుల నీటిని తాగాలి. దీంతో శరీరంలో మలినాలు పేరుకుపోకుండా ఉంటాయి. మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే చాలా మంది సుఖమైన జీవితానికి అలవాటు పడి ఎండలో తిరగడమే మానేస్తున్నారు. అలాగే వ్యాయామం చేయడం కూడా తగ్గిస్తున్నారు. కానీ రోజంతా కూర్చుని పని చేయడం వల్ల మన శరీరంలో కొవ్వు నిల్వలు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుపోతాయి. గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. కనుక రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. అలాగే శరీరానికి ఎండ తగిలేలా కూడా చూసుకోవాలి. ఈ విధంగా మన జీవన శైలిలో, ఆహారపు అలవాట్లల్లో ఇటువంటి మార్పులు చేసుకోవడం వల్ల మనం దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చని ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.