Meal Maker Capsicum : మీల్ మేకర్ లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేకర్ లలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మీల్ మేకర్ లతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కర్రీని తయారు చేస్తూ ఉంటాం. ఈ మసాలా కర్రీలో క్యాప్సికాన్ని వేసి దీనిని మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం వేసి చేసే ఈ మసాలా కర్రీని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే మీల్ మేకర్ క్యాప్సికం మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ క్యాప్సికం మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, తరిగిన క్యాప్సికం – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన టమాటాలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, యాలకులు – 2, లవంగాలు – 2, జాపత్రి – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క.
మీల్ మేకర్ క్యాప్సికం మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ ను గోరు వెచ్చని నీటిలో వేసి పది నిమిషాల పాటు ఉంచాలి. పది నిమిషాల తరువాత వాటిలో ఉండే నీటినంతటిని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి పేస్ట్ లా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి పక్కకు ఉంచాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలావేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత వేయించిన మీల్ మేకర్, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ క్యాప్సికం మసాలా కర్రీ తయారవుతుంది. ఈ కర్రీని అన్నం, చపాతీ, పులావ్ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు.