Castor Oil : ప్రస్తుత కాలంలో మనం వంటలను చేయడానికి అనేక రకాల నూనెలను వాడుతున్నాం. కానీ మన పూర్వీకులు వంటల్లో ఎక్కువగా ఆముదం నూనెను వాడేవారు. వంటల్లో మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఆముదం నూనెను వాడేవారు. ఆముదం నూనెను వాడడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆముదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇతర నూనెలకు లేని చక్కటి గుణం ఆముదం నూనెకు ఉంది. అన్ని రకాల నూనెలు పలుచగా ఉంటాయి. ఆముదం నూనె మాత్రం చాలా చిక్కగా ఉంటుంది. మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు. అలాంటి వారు ఆముదం నూనెను వాడడం వల్ల ఈ సమస్య నుండి బయట పడడమే కాకుండా ఎలాంటి దుష్పభ్రావాలు కూడా ఉండవు.
ప్రేగుల్లో ఉండే శరీరానికి మేలు చేసే బాక్టీరియా నశించకుండా ఆముదం నూనె మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఆముదం నూనెను చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా వాడవచ్చు. ఆముదం నూనెను తాగడం వల్ల ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్.. ప్రేగు గోడలలో ఉండే మ్యూకస్ మెంబ్రీన్ ను ఉత్తేజ పరిచి ప్రేగు కదలికలను, ప్రేగు నుండి ఉత్పత్తి అయ్యే జిగురు శాతాన్ని పెంచుతుంది. ఆముదం నూనెను తాగడం వల్ల ప్రేగు కదలికలు, ప్రేగు నుండి ఉత్పత్తి అయ్యే జిగురు శాతం పెరిగి ప్రేగుల్లో పేరుకు పోయిన మలం త్వరగా బయటకు వస్తుంది.
ఆముదం నూనెను తాగినప్పుడు మలం పలుచగా బయటకు రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆముదం నూనెను తాగే వారు తగిన మోతాదులో మాత్రమే తాగాలి. ఆముదం నూనెను మోతాదుకు మించి త్రాగితే 4 నుండి 5 సార్లు మల విసర్జన జరిగి శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనెను వేడి చేసిన తరువాత మాత్రమే వాడాలి. పచ్చి ఆముదం నూనెలో రిసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ కాలేయం దెబ్బ తినేలా చేస్తుంది.
ఆముదం నూనెను వేడి చేయడం వల్ల ఈ ఎంజైమ్ నశిస్తుంది. ఆముదం నూనె మలబద్దకం సమస్యను తగ్గించడమే కాకుండా గాయాలను, దెబ్బలను కూడా త్వరగా తగ్గిస్తుంది. గాయాలపై, దెబ్బలపై ఆముదం నూనెను రాయడం వల్ల ఈ నూనె చిక్కదనం కారణంగా గాలిలో ఉండే ఫంగస్, వైరస్ లు చర్మం లోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఆముదం నూనెకు ఉండే జిడ్డు గుణం కారణంగా దీనిని ఎక్కువగా ఉపయోగంచరు. కానీ ఎండలో పని చేసే వారు చర్మానికి ఆముదం నూనెను రాసుకోవడం వల్ల చర్మం పొడి బారకుండా, రంగు మారకుండా ఉంటుంది.
తలకు ఆముదాన్ని రాసుకోవడం వల్ల ఎండ వేడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గడమే కాకుండా జుట్టు పొడి బారకుండా, జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. అలాగే జుట్టు నల్లగా మారుతుంది. నూనెలన్నింటిలో కంటే ఆముదం నూనె చాలా ఉత్తమమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.