Children Health: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చిన్నారులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, కలరా, జలుబు, దగ్గు, మలేరియా.. వంటి వ్యాధులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన సూచనలను పాటించడం వల్ల చిన్నారులకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
* చిన్నారులు వర్షాకాలంలో బురద లేదా వర్షపు నీటిలో ఎక్కువగా ఆడతారు. దీంతో వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే ఇంట్లో నేల, గదులు పరిశుభ్రంగా లేకపోయినా వారికి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కనుక ఇంటిని, ఇంటి లోపల పరిసరాలను పరిశభ్రంగా ఉంచాలి. అలాగే బురద, వర్షపు నీటిలో తిరగనీయకూడదు. దీంతో వారికి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూడవచ్చు.
* డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమలు కుట్టడం వల్ల వస్తాయి. కనుక చిన్నారులను దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. దీంతో దోమలు వృద్ధి చెందవు. అలాగే చిన్నారులకు శరీర భాగాలను కప్పి ఉంచేలా దుస్తులను ధరింప జేయాలి. దీంతోపాటు దోమ తెరలను వాడాలి. మస్కిటో రిపెల్లెంట్లను వాడాలి. దీంతో దోమలు కుట్టవు. ఫలితంగా ఆయా వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
* కలుషిత ఆహారాలను తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. కనుక చిన్నారులకు ఇచ్చే ఆహారాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి. ఆహారాలను బాగా వండాలి. అలాగే బయటి పదార్థాలను ఇవ్వకూడదు. దీంతో బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. టైఫాయిడ్ రాకుండా నిరోధించవచ్చు.
* ఈ సీజన్‌లో చిన్నారులకు దగ్గు, జలుబు వస్తుంటాయి. అవి ఇతరుల నుంచి సోకుతాయి. కనుక చిన్నారులు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే వర్షంలో తడవనీయకూడదు. చల్లని పదార్థాలను ఇవ్వకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తే జలుబు రాకుండా చూసుకోవచ్చు.