Coconut Milk Health Benefits : మనం పచ్చికొబ్బరిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనితో పచ్చళ్లు, తీపి వంటకాలు, కొబ్బరి అన్నం ఇలా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అయితే కేవలం పచ్చికొబ్బరే కాకుండా పచ్చికొబ్బరి నుండి వచ్చే కొబ్బరి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిపాలను కూడా చాలా మంది వంటల్లో వాడుతూ ఉంటారు. కొబ్బరి పాలతో చేసే వంటకాలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. అలాగే కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇవి మన ఆరోగ్యానికి అలాగే అందానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరిపాలల్లో ఉండే పోషకాల గురించి అలాగే ఇవి మన ఆరోగ్యానికి, అందానికి ఏ విధంగా సహాయపడతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరిపాలల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఆర్థరైటిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే బరువు తగ్గడంలో కూడా కొబ్బరి పాలు మనకు ఎంతో దోహదపడతాయి. మన శరీర ఆరోగ్యంతో పాటు చర్మ అందానికి కూడా కొబ్బరి పాలు మేలు చేస్తాయి. స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్, కొబ్బరి పాలు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పాడైన చర్మం కూడా తిరిగి నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ పాలను నేరుగా చర్మంపై కూడా రాసుకోవచ్చు. ఇలా రాయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. పొడిబారకుండా ఉంటుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో కొబ్బరి పాలను తీసుకోవాలి.
ఇందులో నిమ్మరసం కలిపి 2 నుండి 3 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత పైన ఏర్పడిన తేటను తీసేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. తరువాత గోరు వెచ్చని నీటిలో తడిపిన టవల్ ను జుట్టుకు చుట్టి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలాచేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా కొబ్బరిపాలు మన ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపణులు చెబుతున్నారు. అలాగే నేటి తరుణంలో చాలా మంది వేగన్ ఫుడ్స్ ను తీసుకుంటున్నారు. అలాంటి వారు కొబ్బరిపాలను తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.