How To Make Mutton Fry : మటన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. మటన్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. మటన్ తో కూర, బిర్యానీ, ఫ్రై వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మటన్ కూరతో పాటు మటన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ కూర, బిర్యానీ వంటి వాటినే కాకుండా మటన్ తో రుచిగా ఫ్రైను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మటన్ ఫ్రై ను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా మటన్ ఫ్రైను తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, రుచిగా మటన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – అరగ్లాస్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, బిర్యానీఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, చిన్నగాతరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, కారం – ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా మటన్ ను శుభ్రంగా కడగాలి. తరువాత కుక్కర్ ను తీసుకుని అందులో కడిగిన మటన్ ను వేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ మటన్ 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తపి పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీఆకు, సాజీరా వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించిన మటన్ ను నీటితో సహా వేసుకోవాలి.
తరువాత కారం, మిక్సీ పట్టుకున్న పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మటన్ ను మధ్యస్థ మంటపై 5 నుండి 8 నిమిషాల పాటు వేయించాలి. నీరంతా పోయి మటన్ దగ్గర పడిన తరువాత కొత్తిమీర వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. చివరగా మరికొద్దిగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.