భారతీయులు ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి సామగ్రిలో కరివేపాకు కూడా ఒకటి. వంటల్లో దీన్ని చాలా మంది వేస్తుంటారు. కరివేపాకును చాలా మంది కూరల నుంచి తీసి పారేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకును టీ రూపంలో చేసుకుని నిత్యం తాగితే అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
25 నుంచి 30 కరివేపాకులను తీసుకుని బాగా కడగాలి. ఒక పాత్ర తీసుకుని అందులో కొంత నీరు పోసి బాగా మరిగించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మరిగిన నీటిలో కరివేపాకులను వేయాలి. ఆ నీటిలో కొంతసేపు ఆ ఆకులను అలాగే ఉండనిస్తే ఆ నీరు రంగు మారుతుంది. తరువాత ఆ నీటిలోంచి ఆకులను తీసేసి ఆ నీటిని తాగాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున కరివేపాకులతో తయారు చేసే ఈ టీని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అవేమిటంటే…
ఆయుర్వేద ప్రకారం కరివేపాకులో మన జీర్ణాశయానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. అందువల్ల ఆ ఆకుల టీని తాగితే సుఖ విరేచనం అవుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. మలబద్దకం, డయేరియా, గ్యాస్ తగ్గుతాయి.
నిత్యం కరివేపాకుల టీని తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. టాంగ్ సెంటర్ ఫర్ హెర్బల్ మెడిసిన్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలకు చెందిన పరిశోధకులు ఈ విషయంపై ప్రయోగాలు కూడా చేశారు. కరివేపాకుల టీ వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని, షుగర్ లెవల్స్ 45 శాతం వరకు తగ్గుతాయని తేల్చారు.
కరివేపాకుల టీని తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ తగ్గుతాయి. గర్భిణీలు ఈ టీని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు చేసేవారు ప్రయాణాలకు ముందు ఈ టీని తాగితే జర్నీలో వాంతులు కాకుండా ఉంటాయి.
కరివేపాకుల్లో ఫినోలిక్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. చర్మ కణాలను సురక్షితంగా ఉంచుతాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు, వాపులు రాకుండా కాపాడుతాయి. ఈ విషయాలను ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
నిత్యం మనం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. అయితే సాయంత్రం పూట ఒక కప్పు కరివేపాకుల టీని తాగితే ఒత్తిడి అంతా మటుమాయం అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.