Diabetes And Mouth : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిస్ కూడా ఒకటి. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. రోజు రోజుకు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. అయితే కొందరు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక మరింత తీవ్రతరం చేసుకుంటున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది షుగర్ వ్యాధి అనగానే తరచూ మూత్రవిసర్జన, నీరసం, ఆకలి, అలసట వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి అని భావిస్తారు కానీ మన నోరు చూసి కూడా మనం షుగర్ వ్యాధితో బాధపడుతున్నామో లేదో చెప్పవచ్చు. తరచూ నోరు ఎండిపోతూ ఉంటే టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారని అర్థం. అలాగే నాలుక పొడిబారుతుంది.
పెదవులు ఎండిపోయి పగులుతాయి. నోట్లో పుండ్లు వంటి వాటితో పాటు మిగడం, మాట్లాడడం, నమలడం కూడా కష్టంగా మారుతుంది. అలాగే చిగుర్ల సమస్యలు కూడా తలెత్తుతాయి. చిగుళ్ల వాపులు, చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అదే విధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారిలో నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. దంతాలు కూడా వదులుగా తయారవుతాయి. అంతేకాకుండా దంతాలు కూడా ఊడిపోతాయి. మధుమేహ వ్యాధితో బాధపడే వారిలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే దంతక్షయం, దంతాల నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈ విధంగా మన నోటిని చూసి మనం టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నామని చెప్పవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన రక్తపరీక్షలు చేయించుకోవాలి. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసినట్టయితే శరీరంలో బీటా కణాలు దెబ్బతింటాయి. అలాగే శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. అలాగే దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే రక్తనాళాలు దెబ్బతింటాయి.
గుండెపోటు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. దంత వైద్యున్ని సంప్రదించి దంతాలకు పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధంగా షుగర్ వ్యాధిని ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని లేదంటే మరింత తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.