Rice Water : అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కొలవడం పురాతణ కాలం నుండి వస్తున్న ఆచారం. అన్నం మనకు ప్రధాన ఆహారంగా ఎంతో కాలం నుండి వస్తూ ఉంది. అన్నాన్ని వండాలంటే మనకు తప్పనిసరిగా బియ్యం అవసరం. అన్నం వండడానికి ముందు బియ్యాన్ని శుభ్రంగా కడుగుతారు. చాలా మంది ఈ బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటారు. కానీ బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయని వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఈ నీటిని ఎవరూ పారబోయరని నిపుణులు చెబుతున్నారు.
అసలు బియ్యం కడిగిన నీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అన్నం వండేటప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడగుతారు. ఆ నీటిని పారబోయడమో, మొక్కలకు పోయడమో, పశువులకు తాగించడమో చేస్తారు. కానీ వాటిలో ఉండే పోషకాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయరు. బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవడంతోపాటు చక్కటి ముఖ వర్చస్సును సొంతం చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిలో బి విటమిన్ ఉంటుందని నిపుణులు కనుగొన్నారు. వేడి చేసి నోటిపూత బారిన పడినప్పుడు బి కాంప్లెక్స్ టాబ్లెట్ లను వాడడానికి బదులుగా బియ్యం కడిగిన నీటిని తాగితే వెంటనే నోటిపూత తగ్గుతుంది.
అంతేకాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బియ్యం కడిగిన నీరు మనకు ఎంతగానో సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది. అదే విధంగా చుండ్రు సమస్య నుండి కూడా విముక్తి లభిస్తుంది. ముఖంపై మొటిమలతో బాధపడుతున్నప్పుడు బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవడం వల్ల మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి. చర్మంపై దురదలతో ఇబ్బందిగా ఉన్నప్పడు దూదిని తీసుకుని ఈ నీటిలో ముంచి దురదలపై రుద్దితే దురదలు తగ్గుతాయి.
బియ్యం కడిగిన నీటిలో ఎసెన్షియల్ ఆయిల్స్ ను కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కొన్ని నిమిషాల తరువాత జుట్టును నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పట్టులాంటి జుట్టును సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాలు, చిగుళ్లు గట్టి పడి దంతాల సమస్యలు తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీటితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈ నీటిని పారబోయకుండా సద్వినియోగపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.