Coffee : రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మంది దినచర్య కాఫీతో ప్రారంభమవుతుంది. కాఫీ తాగనిదే కొందరు తమ రోజువారీ పనులను ప్రారంభించరు. ఈ క్రమంలోనే కాఫీ అనేది కొందరి నిత్యావసర వస్తువుగా మారింది. ఇక కొందరు అయితే రోజు మొత్తం కాఫీలను అదే పనిగా తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగినప్పటికీ అది ఎక్కువైతే అనర్థాలు కలుగుతాయి. కనుక కాఫీని కూడా రోజూ తగినంత మోతాదులోనే తాగాలి. ఇక కాఫీని రోజుకు ఎన్ని కప్పుల వరకు తాగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు కాఫీ వల్ల కలుగుతాయి.
కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. మనం రోజూ 400 మిల్లీగ్రాముల మేర కెఫీన్ ను తీసుకోవచ్చు. అంతకు మించి కెఫీన్‌ను తీసుకోరాదు. తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. కనుక కెఫీన్ మోతాదు మించకుండా కాఫీని తాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రోజుకు 3 నుంచి 4 కప్పుల వరకు కాఫీని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. సుమారుగా 70 ఎంఎల్ పరిమాణంలో ఉండే కప్పు అయితే అలాంటివి రోజుకు 4 కప్పులు తాగవచ్చు. అదే 140 ఎంఎల్ కప్పు అయితే రోజుకు 2 కప్పుల కాఫీ మాత్రమే తాగాలి. ఎటొచ్చీ రోజుకు 280 ఎంఎల్ లోపు పరిమాణంలో మాత్రమే కాఫీని తాగాల్సి ఉంటుంది. అంతకు మించరాదు. మించితే శరీరంలో కెఫీన్ పరిమాణం పెరుగుతుంది. అది సమస్యలను తెచ్చి పెడుతుంది.
రోజుకు అధిక మోతాదులో కాఫీని తాగడం వల్ల తలతిరగడం, డీహైడ్రేషన్, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, కంగారు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. కనుక కాఫీ ద్వారా ప్రయోజనాలను పొందాలంటే దాన్ని రోజూ పరిమిత మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.