Foods : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అయితే కొన్ని ఆహారాలను మనం ఉదయం తింటే కొన్నింటిని మధ్యాహ్నం, ఇంకొన్నింటిని రాత్రి పూట తింటుంటాం. కానీ కొన్ని ఆహారాలను అసలు రాత్రిపూట తినకూడదని, తింటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి రాత్రి పూట ఏయే ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా. రాత్రి పూట కొన్ని ఆహారాలను తినడం వల్ల అది మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది. దీంతో మొత్తంగా అది మన శరీర ఆరోగ్యంపై ప్రభావం పడేలా చేస్తుంది. అలాగే రాత్రి మనం తినే కొన్ని ఫుడ్స్ వల్ల జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. కనుక కొన్ని రకాల ఫుడ్స్‌ను మనం రాత్రి పూట తినకూడదు.
కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను రాత్రిపూట అసలు తినకూడదు. ఇవి పొట్టలో అసౌకర్యాన్ని కలగజేస్తాయి. దీంతో గుండెల్లో మంట, అజీర్తి ఏర్పడుతాయి. దీని వల్ల జీర్ణాశయంలో యాసిడ్ల శాతం పెరుగుతుంది. దీంతో కడుపులో మంట కూడా వస్తుంది. ఫలితంగా రాత్రిపూట నిద్ర పట్టదు. అలాగే మరుసటి ఉదయం విరేచనం అయ్యేటప్పుడు మంటగా కూడా ఉంటుంది. కనుక రాత్రి పూట కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను అసలు తినకూడదు.
చాలా మంది రాత్రి పూట స్నాక్స్ అయిన సమోసా, పకోడీలను తింటారు. కొందరు భోజనంలో వీటిని అంచుకు పెట్టి తింటారు. అయితే వీటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక రాత్రి సమయంలో వీటిని తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. అలాగే నిద్ర కూడా పట్టదు. కనుక రాత్రి పూట వీటిని కూడా మానేయాలి. కొందరు రాత్రి సమయంలో కబాబ్స్, బటర్ చికెన్ వంటి మాంసాహారాలను అతిగా తింటుంటారు. అలా తినడం కూడా మంచిది కాదు. వీటిల్లో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. కనుక జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి రాత్రిపూట వీటిని కూడా తినరాదు.
అలాగే రాత్రి పూట స్వీట్లు తినడం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరుతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. ఇది డయాబెటిస్, గుండె జబ్బులకు దారి తీస్తుంది. కనుక వీటిని కూడా మానేయాలి. అదేవిధంగా టీ, కాఫీ, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, నిమ్మ జాతికి చెందిన పండ్లు, కొవ్వు తీయని పాలు లేదా పాల ఉత్పత్తులు, ఐస్ క్రీములు, వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, మద్యం వంటి వాటిని రాత్రిపూట అసలు తీసుకోకూడదు. వీటిని రాత్రిపూట తీసుకుంటే అనారోగ్యాలకు స్వాగతం పలికినట్లు అవుతుంది. కనుక రాత్రిపూట తీసుకునే ఫుడ్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే కోరి వ్యాధులు తెచ్చుకున్నవారు అవుతారు.