అటు ఆఫీసులోను ఇటు ఇంట్లోను పనులు వుంటూ వుంటే ఇక మీకు అంటూ కొంచెం సమయం కూడా కేటాయించుకోలేరు. వ్యాయామం అసలు కుదరదు. ఇక బరువు పెరుగుతూంటారు. కనుక మీరు ఇంట్లో వున్నా లేక ఆఫీసులో వున్నా చేసుకోగల చిన్నపాటి వ్యాయామాలు చూద్దాం! ఇంటి పనులు చేసుకోవడం మీకు వ్యాయామానికి ఒక మంచి అవకాశమే. మాపింగ్, క్లీనింగ్, ఐరనింగ్ మొదలైనవి చేస్తూనే కొన్ని చిన్న వ్యాయామాలు చేయవచ్చు. ఎలాగో చూడండి….. వంటగది క్లీనింగ్ – స్టవ్ పైభాగాలు రుద్దడం, లేక కిచెన్ లోని ఇతర వస్తువుల పై భాగాలు శుభ్రం చేయటం చేతులకు మంచి వ్యాయామం.
అదే విధంగా డిష్ వాషర్ ఉపయోగించకుండామీ చేతులతో గిన్నెలు కడగటం వేళ్ళకు మంచి వ్యాయామమవుతుంది. నేల శుభ్రం చేయుట- వంటగది, బాత్ రూమ్, లివింగ్ రూమ్ మొదలైన నేలలు తుడవండి. మాపు ఉపయోగించకండి. చేతితో బ్రష్ పట్టి తుడవండి. త్వర త్వరగా అన్ని మూలలకు మీ చేతులను చాపుతూ క్లీన్ చేయండి. నేలపై కూర్చుని తుడవండి. అది మీ తొడ భాగాలను పటిష్టం చేస్తుంది. పొట్ట, చేతులు కూడా మంచి వ్యాయామం కలిగి వుంటాయి. వాషింగ్ మరియు ఐరనింగ్- పాతపద్ధతిలో గుడ్డలు ఉతకటం మంచి వ్యాయామం. పూర్తిగా చేయలేకపోయినా గుడ్డలు పిండటంలో ఆరవేయటంలో చేతులు, కాళ్లు బాగా చాపి చేసుకోండి. గుడ్డలు పిండేటపుడు తరచుగా వంగండి. పిండటం చేతులకు కూడా మంచిది. గుడ్డలు ఆరపెట్టడంలో వేలాడదీయటానికి చేతులు చాపండి.
ఇక ఎండిన గుడ్డల ఐరనింగ్ లో మీ భుజాలకు, మెడకు, శరీర పై భాగ కండరాలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. బెడ్ షీట్లు మార్చండి-పాత బెడ్ షీట్లు తీయడం దులపటం మేట్రస్ లు జరపటం, కాట్ తిన్నగా జరపటం, పిల్లోలకు కవర్లు, వాటిని అణచటం ఇవన్ని మీ శరీర పై భాగాన్ని బలపరుస్తాయి. తలుపులు, కిటికీలు కడగండి- ఈ పనిలో చేతులు బాగా కదులుతాయి. విండో పైభాగాలు, డోర్ పై భాగాలు క్లీన్ చేయటానికి చేతులు చాచండి. మరీ ఎత్తుగా వుంటే స్టూలు వేసుకోండి. స్టూలు పైకి ఎక్కటం, కిందకు దిగటం వంటివి మీ పిక్కలను బలపరుస్తాయి. కారు వాష్ చేయండి- స్పాంజి పట్టుకుని కారు పైభాగానికి సాగండి. టైర్లు క్లీన్ చేసేటపుడు కింద కూర్చోండి. ఫైనల్ వాష్ కు హోస్ పైప్ వేయకుండా ఒక తొట్టినుండి బకెట్ తో వాటర్ పైకి లాగండి. ఈపనికి మీ శరీరం చక్కటి వ్యాయామం తీసుకుంటుంది. ప్రతి రోజూ ఇంటిపనులు చేసుకుంటే కనుక మీ శరీరం అమోఘంగా బలాన్ని పుంజుకొని ఆరోగ్యంగా వుంటుంది.