మన భారతీయ సాంప్రదాయం ప్రకారం చిన్నపిల్లలకు పోగులు కుట్టించడం అనేది చాలా పవిత్రమైన వేడుక. చాలా మంది ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే పెద్దలకు అది సంతోషంగానే ఉంటుంది గాని, పిల్లలకు మాత్రం నరకం. దీనితో తల్లి తండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. పిల్లలకు చెవులు కుట్టించే ముందు కచ్చితంగా తల స్నానం చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఒక వారం మాత్రం చెవులపై చుక్క నీళ్ళు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుని స్నానం చేయించాలి. చెవులకు అసలు నీళ్ళు తగలకూడదు. అదే విధంగా కొన్ని రోజుల పాటు స్టడ్స్ లేదా చిన్న చిన్న రింగులు లాంటివి పెడితే నొప్పి తగ్గడంతో పాటుగా చెవి రంధ్రం కూడా పెద్దది అవుతుంది.
చెవులు కుట్టించిన రెండు మూడు రోజులు చిన్నారులకు టీ షర్ట్స్, స్వెట్టర్స్ లాంటివి వేయొద్దు… అంటే తలపై నుంచి వేసేవి అన్నమాట. గుండీలు పెట్టేవి అయితే బెస్ట్. అప్పుడు దుస్తులకు అవి పట్టుకోకుండా ఇబ్బంది లేకుండా ఉంటాయి. చిన్న పిల్లలకు చర్మం సున్నితంగా ఉంటుంది. దీనితో వారికి చీము పట్టవచ్చు. అప్పుడు దూదితో తుడిచి కొబ్బరి నూనెతో మర్దన చేయడంతో సమస్య తీవ్రమవకుండా ఉంటుంది. మరీ పసిపిల్లలు అయితే వాళ్లకు తెలియదు కాబట్టి చెవులకు పెట్టిన కమ్మలను చిరాకుతో లాగేస్తూ ఉంటారు. ఒకవేళ బలంగా లాగితే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళను ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. అలాగే పిల్లలను ఎత్తుకునే సమయంలో బుగ్గల మీద ముద్దు కూడా పెట్టకూడదు. మీ ముక్కు లేదా మొఖం ఆ చెవులకు తగిలి వాళ్లకు ఇబ్బందిగా ఉండటంతో పాటుగా దురద లాంటిది వచ్చి లాగేస్తూ ఉంటారు. అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వాళ్ళు పడుకునే సమయంలో తలగడగా చాలా మెత్తగా ఉండేవి వెయ్యాలి. లేకపోతే పక్కకు తిరిగి పడుకున్నప్పుడు వాళ్లకు నొప్పి రావడమే కాకుండా బెడ్ షీట్ కి ఉన్న దారం లాంటివి చిక్కుకుని వాళ్ళు బలంగా లాగితే గాయం పెద్దది అవుతుంది. రాగివి కుట్టిస్తే త్వరగా పడే అవకాశం ఉండదు కాబట్టి చీము పడుతుంది. పడే లోహాన్ని ఉపయోగిస్తే మంచిది.