Garlic : నిన్న మొన్నటి వరకు ఎండలు భగభగమంటూ మనల్ని ఇబ్బందులు పెట్టాయి. అయితే ఒకటి రెండు రోజుల నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. అయినప్పటికీ ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక మృగశిర కార్తె వచ్చేసింది. కనుక వాతావరణం వేగంగా మారుతుంది. కొద్ది రోజులు పోతే వర్షాలు కూడా పడతాయి. దీంతో సీజన్ పూర్తిగా మారుతుంది. కనుక ఈ సమయంలోనే మనం మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇందుకు గాను వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి మింగేయాలి. ఘాటుగా ఉన్నాయనుకుంటే కాస్త తేనెతో కలిపి తినవచ్చు. ఈ విధంగా చేయడాన్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఈ సమయంలో వెల్లుల్లిని తప్పనిసరిగా తినాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
మనకు సహజంగానే ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబుతోపాటు విష జ్వరాలు కూడా ప్రబలుతుంటాయి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. ఈ వ్యాధులు అన్నీ బాక్టీరియా, వైరస్‌ల కారణంగానే వస్తాయి. ఇవే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ జరిగి విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే రోజూ వెల్లుల్లిని తినాలి.
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటే మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల వచ్చే వ్యాధులు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. వెల్లుల్లిని తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే పురుగులు కూడా నశిస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు రావు. అలాగే దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. కనుక వెల్లుల్లిని రోజూ పరగడుపునే తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.