Fenugreek Seeds And Leaves : మన వంట ఇంటి పదార్థాల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులను మనం ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నాం. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. మెంతులను వంటల్లో వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే మెంతికూర కూడా చాలామందికి తెలుసు. మెంతికూరను చాలామంది తరచూ తింటుంటారు. దీంతో కూర లేదా పప్పు చేసుకోవచ్చు. అలాగే కొందరు పచ్చడి కూడా చేసుకుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. మెంతులను తినాలా మెంతికూరను తినాలా అని చాలామంది సందేహిస్తుంటారు. ఈ క్రమంలో దీనికి ఆయుర్వేదం ఏమని సమాధానం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు చూసేందుకు చిన్నగా గోధుమ రంగులో ఉంటాయి. వీటిని మనం వంటల్లో వేస్తుంటాం. మెంతులలో సాల్యబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. మెంతుల్లో ప్రోటీన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. మెంతులలో విటమిన్లు బి6, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. మెంతుల్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. మెంతులను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. మెంతులను తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మెంతులను తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.
మెంతులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాలింతలు మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే వారిలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే పిల్లలకు పోషణ లభిస్తుంది. మెంతులను మహిళలు తీసుకోవడం వల్ల వారిలో హార్మోన్ల సమస్య నుంచి బయటపడవచ్చు. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మెంతి ఆకుల విషయానికొస్తే వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి వరం అని చెప్పవచ్చు. మెంతికూరలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
మెంతికూరలో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, ఐరన్ అధికంగా ఉంటాయి. మెంతులలాగే మెంతికూరలోనూ ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. మెంతి ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెంతి ఆకులను తినడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు. మెంతి ఆకులలో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరను తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మెంతి ఆకులను తింటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించి శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించవచ్చు.
మెంతి ఆకుల్లో విటమిన్లు ఎ, సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మెంతులు, వాటి ఆకులు రెండూ మనకు ప్రయోజనాలను అందించేవే. కానీ మెంతులను తినడం వల్ల కొందరికి వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి వారు మెంతి ఆకులను తినవచ్చు. ఇక పోషకాల విషయానికొస్తే మాత్రం మెంతి ఆకుల్లోనే అవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పోషకాలు కోరుకునేవారు మెంతి ఆకులను తినాలి. అయితే రెండింటినీ ఆహారంలో తరచూ తింటుంటే రెండు రకాలుగా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.