Cauliflower Rasam : కాలిఫ్లవర్‌ను తినడం వల్ల మనకు ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తింటే ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారం తినలేని వారికి ఇవి వరమనే చెప్పవచ్చు. కాలిఫ్లవర్‌లో ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, క్యాల్షియం కూడా సమృద్ధిగానే ఉంటాయి. అలాగే కాపర్, జింక్, మాంగనీస్, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, థయామిన్, నియాసిన్ కూడా ఉంటాయి. అందువల్ల కాలిఫ్లవర్‌ను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఇక కాలిఫ్లవర్‌తో మనం అనేక రకాల వంటకాలను కూడా చేస్తుంటాం.
కాలిఫ్లవర్‌ను చాలా మంది వేపుడు రూపంలో తింటారు. లేదా టమాటాలు వేసి వండి తింటారు. వీటితో మంచూరియా కూడా చేయవచ్చు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే కాలిఫ్లవర్‌తోనూ ఎంతో చక్కగా రసం తయారు చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. కాలిఫ్లవర్‌తో తయారు చేసే రసం ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నంలో కలుపుకుని తినవచ్చు. ఇది రుచిగా ఉండడమే కాదు, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ క్రమంలోనే కాలిఫ్లవర్‌తో రసం తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ ముక్కలను ఒక కప్పు తీసుకోవాలి. అలాగే కందిపప్పు, శనగపప్పులను కూడా ఒక చెంచా చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు చింతపండు ఒక నిమ్మకాయంత సైజు కావాలి. అలాగే జీలకర్ర, మిరియాలు ఒక టీస్పూన్ చొప్పున, టమాటాలు 2, పచ్చి మిర్చి 3, కొత్తిమీర తరుగు అర కప్పు, ఉప్పు 1 టీస్పూన్ అవసరం అవుతాయి. వీటితోపాటు పసుపు పావు టీస్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, నెయ్యి గరిటెడు, తాళింపు దినుసులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
వేయించిన కందిపప్పు, శనగపప్పు, మిరియాలు, జీలకర్రను జార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాక నెయ్యితో తాళింపు వేసి కాలిఫ్లవర్ ముక్కలు, టమాటా గుజ్జు వేసి వేగనివ్వాలి. ఇందులో 6 కప్పుల నీళ్లను పోసి గ్రైండ్ చేసిన పొడి, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి మరిగించాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఘుమఘుమలాడే కాలిఫ్లవర్ రసం రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపి వేడిగా తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని అందరూ ఎంతో ఇష్టపడతారు. కాస్త శ్రమపడాలే కానీ ఈ రసాన్ని చక్కగా తయారు చేసుకోవచ్చు.