సీజ‌న్ మారుతోంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఇన్ని రోజులూ చ‌లి వ‌ల్ల దుప్ప‌టి శ‌రీరం నిండా క‌ప్పుకుని ప‌డుకోవాల్సి వ‌చ్చేది. కానీ గ‌త రెండు మూడు రోజులుగా సీజ‌న్ మారింది. ప‌గ‌లు వేడి, రాత్రి చ‌లి ఉంటోంది. ఇది వేస‌వి కాలం ఆరంభం అవుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతం. అంటే సీజ‌న్ మారుతుంద‌ని అర్థం. చ‌లి కాలం నుంచి మ‌నం వేస‌వి కాలానికి మారుతున్నాం. అందువ‌ల్ల వ‌చ్చే సీజ‌న్‌కు అనుగుణంగా మ‌నం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి.

follow these important tips for upcoming summer season

పానీయాలు

ఈ సీజ‌న్‌లో పానీయాల‌ను తాగే ముందు జాగ్ర‌త్త వ‌హించండి. ఎందుకంటే ప‌గ‌లు వేడిగా ఉంద‌ని చెప్పి కొంద‌రు చ‌ల్ల‌ని నీటిని తాగుతుంటారు. దీని వ‌ల్ల రాత్రి వ‌ర‌కు జ‌లుబు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఇప్పుడే చ‌ల్ల‌ని నీటిని తాగాల్సిన ప‌నిలేదు. గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉండే నీటిని తాగాలి. దీంతో జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ రాకుండా ఉంటాయి.

ద్ర‌వాహారం

ఈ సీజ‌న్‌లో మ‌నం ఘ‌నాహారాన్ని త‌క్కువ‌గా ద్ర‌వాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే త‌క్కువ క్యాల‌రీలు ఇచ్చే ఆహారాల‌ను తినాలి. ముఖ్యంగా వేపుళ్లు, కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను మానేయాలి. లేదా త‌క్కువ‌గా తినాలి. లేదంటే జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

రోగ నిరోధ‌క శ‌క్తి

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు రాకుండా ఉంటాయి. నిత్యం విట‌మిన్ ఎ, సి ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

నీటి కొర‌త

వేసవిలో చెమట కారణంగా ఎలక్ట్రోలైట్స్ కోల్పోతారు. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్ప‌డుతుంది. అందువ‌ల్ల రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. తగినంత నీటిని తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవ‌చ్చు. శ‌రీరంలో ద్ర‌వాలు త‌గ్గ‌కుండా ఉంటాయి. నీరు, నిమ్మకాయ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవ‌చ్చు. దీంతో డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. అలాగే మద్యం, హార్డ్ డ్రింక్స్ తాగడం మానేయాలి.

చ‌ర్మ సంర‌క్ష‌ణ

సూర్యుడి నుంచి వ‌చ్చే హానికరమైన కిరణాల నుండి చ‌ర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ లోష‌న్ రాసుకోవ‌డం ఉత్త‌మం. కాటన్ దుస్తుల‌ను ధరించాలి. ఎల్లప్పుడూ లేత రంగుల్లో ఉండే దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది.

పోష‌కాహారం

కాలానుగుణ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం ఒక్క‌టే అద్భుత‌మైన మార్గం. మీ ఆహారంలో పోషకమైన ఆహారాల‌ను చేర్చుకోవాలి. రాత్రిపూట‌ తేలికగా జీర్ణం అయ్యే ఆహారాల‌ను తినాలి. సలాడ్లు, రసాలు, సూప్, స్మూతీస్ తీసుకోవ‌చ్చు. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పాదాల సంర‌క్ష‌ణ

వేసవిలో పాదాల‌ను కూడా సంర‌క్షించుకోవాల్సి ఉంటుంది. పాదాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ల్ల‌ని నీటితో క‌డిగి శుభ్రం చేయ‌డం వల్ల పాదాలు సుర‌క్షితంగా ఉంటాయి.

స్నానం

వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేయడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. వేడి పోతుంది. అలాగే దుమ్ము, ధూళి తొలగిపోతుంది. కావాలంటే స్నానపు నీటిలో వేప ఆకులను వేసి కొద్ది సేపు అయ్యాక ఆ నీటితో స్నానం చేయ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మం సురక్షితంగా ఉంటుంది.

Admin

Recent Posts