కీటో డైట్‌ను పాటించడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. దీంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో భాగంగా నిర్దిష్టమైన మోతాదులో పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కీటో డైట్‌ను పాటించాలనుకునే వారు ఈ కింద ఇచ్చిన విషయాలను ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
1. కీటో డైట్‌లో భాగంగా కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా, కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాలను చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్లను రోజూ 20 నుంచి 30 గ్రాముల మేర మాత్రమే తీసుకోవాలి. అందువల్ల ఈ విషయం తెలుసుకుని కీటో డైట్‌ను పాటిస్తే మంచిది.
2. కీటో డైట్‌లో భాగంగా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆరంభంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. కానీ కొవ్వు పదార్థాలు అంటే చికెన్, మటన్, చేపలు మాత్రమే కాదు, నట్స్, ఆలివ్ నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలను కూడా తీసుకోవచ్చు. కనుక వాటిని సమయానుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కీటో డైట్ అలవాటు అవుతుంది.
3. కీటో డైట్‌లో భాగంగా కొవ్వు పదార్థాల తరువాత ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. కానీ మోతాదుకు మించరాదు. అధికంగా తీసుకుంటే అది గ్లూకోజ్‌గా మారుతుంది. కనుక శరీరానికి అవసరం అయిన మేర మాత్రమే ప్రోటీన్లను తీసుకోవాలి.
4. కొవ్వు పదార్థాలను తినాలని చెప్పి కీటోడైట్‌లో జంక్ ఫుడ్, వేపుళ్లు, ప్రాసెస్ చేయబడిన పదార్థాలను తినరాదు. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి.
5. కీటో డైట్‌లో భాగంగా కాఫీలో కొబ్బరినూనె, వెన్న కలిపి తాగితే అస్సలు ఆకలి తెలియదు. ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
6. కీటో డైట్‌ను 3 నుంచి 6 నెలల పాటు పాటించవచ్చు. అయితే అంతకు మించి ఈ డైట్‌ను చేయరాదు. అవసరమైన మేర లక్ష్యాన్ని సాధించాం అనుకుంటే ఈ డైట్‌ను చేయడం మానేయాలి. అతిగా చేయరాదు. ఫలితం రాకపోతే కొన్ని నెలల పాటు ఆగి మళ్లీ ప్రయత్నించాలి.
7. కీటో డైట్ చేసే వారికి ఆరంభంలో కీటో ఫ్లూ వస్తుంది. దీని వల్ల మలబద్దకం, విరేచనాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలా వస్తే మీ శరీరం కీటో డైట్‌కు అలవాటు పడుతున్నట్లు అర్థం. ఈ స్థితి ఒక వారం వరకు ఉండవచ్చు. ఆ తరువాత మామూలుగా అయిపోతారు. కనుక ఆందోళన చెందాల్సిన పనిలేదు.
8. కీటోడైట్‌లో భాగంగా కిడ్నీలు ఎలక్ట్రోలైట్స్ ను ఎక్కువ బయటకు పంపుతాయి. అందువల్ల సోడియం పొటాషియం ఉండే కూరగాయలు, పండ్లను తీసుకోవాలి.
9. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు, హైబీపీ, గుండె జబ్బుల బారిన పడిన వారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కీటోడైట్‌ను పాటించరాదు. పాటించాలనుకుంటే డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి.