ఆరోగ్యం

డెంగ్యూతో జాగ్రత్త.. ఈ వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఒకటి. ఇది ఏడాదిలో ఎప్పుడైనా రావచ్చు. కానీ వర్షాకాలం సమయంలో సహజంగానే దోమలు విజృంభిస్తాయి, కనుక ఈ సీజన్‌లో చాలా మంది డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ అనేది ఎయిడెస్‌ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమ కుట్టడం వల్ల వస్తుంది. దీంతో పలు లక్షణాలు కనిపిస్తాయి.

dengue symptoms treatment tips to follow

డెంగ్యూ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు

డెంగ్యూ వచ్చిన వారికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం వస్తుంది. 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్‌హీట్‌ మేర జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కళ్లు మంటలు వస్తాయి. కొందరికి కడుపులో తిప్పినట్లు అనిపించడం, వాంతులు అవడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరిగితే రోగికి తీవ్రంగా నీరసం ఉంటుంది. తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొందరికి ముక్కు నుంచి రక్తం పడుతుంది. మలం నల్లని రంగులో ఉంటుంది. దోమ కుట్టిన చోట ఎర్రని చుక్కలా మారుతుంది.

డెంగ్యూ వచ్చిన వారిలో చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు కనిపిస్తాయి. ఆకలి ఉండదు. గొంతు కింద, చంకల్లో నరాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. కళ్లు ఎర్రగా మారుతాయి. డెంగ్యూ వచ్చిన వారిలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి సుమారుగా 3.50 లక్షల నుంచి 5 లక్షల మేర ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. కానీ డెంగ్యూ వచ్చిన వారికి 30వేల కన్నా దిగువకు పడిపోతాయి. చికిత్స ఇవ్వకపోతేనే ఇలా జరుగుతుంది. ఇస్తే క్రమంగా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. రోగికి ప్రాణాపాయం తప్పుతుంది.

చికిత్స

డెంగ్యూ వచ్చినప్పటికీ చాలా మందికి హాస్పిటల్‌లో చికిత్సను అందించాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ మందులను వాడితే సరిపోతుంది. లక్షణాలు తగ్గకపోగా, తీవ్రతరం అవుతుంటేనే హాస్పిటల్‌లో చికిత్స అందించాలి.

డెంగ్యూ వచ్చిన వారికి ద్రవాలను ఎక్కిస్తారు. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతే వాటిని ఎక్కించాల్సి వస్తుంది. దీంతోపాటు ఆయా లక్షణాలకు అనుగుణంగా మందులను అందిస్తారు. డెంగ్యూ వచ్చిన వారికి బీపీ అమాంతం పెరిగినా, వాంతులు బాగా అవుతున్నా, శ్వాస తీసుకోవడం కష్టమవుతున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాలి.

డెంగ్యూ వచ్చిన వారు అనారోగ్య సమస్యల నుంచి కోలుకునేంత వరకు, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగే వరకు హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాలి. అందుకు గాను కనీసం 3 రోజుల సమయం పడుతుంది. తరువాత డిశ్చార్జి అయి ఇంట్లో జాగ్రత్తగా ఉంటూ మందులను వాడితే సరిపోతుంది.

డెంగ్యూ రాకుండా నిరోధించవచ్చు

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ రాకుండా అడ్డుకోవచ్చు. డెంగ్యూ దోమల వల్ల వస్తుంది కనుక దోమలు లేకుండా చేసుకుంటే చాలు. ఇల్లు, ఇంటి చుట్టు పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. మస్కిటో రీపెల్లెంట్లను వాడాలి. దోమ తెరలను ఉపయోగించాలి. దీంతో దోమలు రాకుండా అడ్డుకోవచ్చు. డెంగ్యూ రాకుండా ముందుగానే నివారించవచ్చు.

డెంగ్యూ వచ్చిన వారు పాటించాల్సిన జాగ్రత్తలు

1. డెంగ్యూ వచ్చిన వారు పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లను తాగాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి పూట బాగా నిద్రించాలి.

2. రోజూ బొప్పాయి పండ్లను తినాలి. అలాగే రోజుకు రెండు సార్లు పావు టీస్పూన్‌ చొప్పున బొప్పాయి ఆకుల రసం తాగాలి. దీంతో ప్లేట్‌లెట్లు పెరిగి త్వరగా కోలుకుంటారు.

3. కూరగాయలు, పండ్లను జ్యూస్‌లా చేసి తీసుకుంటే శక్తి, పోషకాలు లభిస్తాయి. త్వరగా కోలుకుంటారు.

4. అల్లం టీ, యాలకుల టీ, దాల్చిన చెక్క టీ వంటి హెర్బల్‌ టీలను తాగుతుండాలి.

5. వేపాకుల్లో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయి. కనుక 4-5 వేపాకులను తీసుకుని బాగా నలిపి చిన్న ఉండలా చేసి ఉదయం పరగడుపునే మింగాలి. దీంతో డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

Admin

Recent Posts