Ginger For Diabetes : ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్య కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధకత కారణంగా తలెత్తే టైప్ 2 డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది ప్యాంక్రియాసిస్ గ్రంథి నుండి విడుదల అవుతుంది. రక్తంలో ఉండే గ్లూకోజ్ కణాల్లోకి సులభంగా వెళ్లేలా చేయడంలో ఇన్సులిన్ సహాయపడుతుంది. అయితే ఇన్సులిన్ నిరోధకత కారణంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఇన్సులిన్ నిరోధకత కారణంగా తలెత్తే టైప్ 2 డయాబెటిస్ సమస్య బారిన పడడానికి వివిధ కారణాలు ఉంటాయి. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటి వాటిని టైప్ 2 డయాబెటిస్ బారిన పడడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే జన్యుపరంగా కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటిస్ నుండి బయట పడడానికి మందులను వాడుతూ ఉంటారు. అలాగే ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. వీటితో పాటు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు మన వంటింట్లో ఉండే అల్లాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అల్లం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అల్లాన్ని ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో రక్తంలో ఉండే గ్లూకోజ్ కణాల్లోకి సులభంగా వెళ్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని రోజుకు 2 నుండి 5 గ్రాముల మోతాదుల్లో తీసుకోవడం వల్ల 12 రోజుల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు 12 శాతం తగ్గుతున్నాయని నిపుణులు వెల్లడించారు. కనుక ప్రతిరోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని దీంతో టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే అల్లాన్ని నేరుగా నూనెలో వేసి వేయించడం వల్ల దాని వల్ల పోషకాలు నశిస్తాయని అలా వేయించిన అల్లాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు అల్లాన్ని ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని దీనిని వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణలు చెబుతున్నారు.