గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు తినాల్సిన.. తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

మ‌న శ‌రీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా పేరుకుపోతే అది కీళ్ల‌లో చేరుతుంది. అక్క‌డ అది చిన్న చిన్న స్ఫ‌టికాలుగా మారుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ స్థితినే గౌట్ అంటారు. కీళ్ల‌లో ఉండే స్ఫ‌టికాల వ‌ల్ల తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. మ‌నం తినే కొన్ని ర‌కాల ఆహారాల్లో ప్యూరిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే దాంతో శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఈ క్ర‌మంలోనే కీళ్ల‌లో యూరిక్ యాసిడ్ చేరి అది స్ఫ‌టికాలుగా మారి గౌట్ స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది.

గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు తినాల్సిన.. తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

గౌట్ స‌మ‌స్య వ‌చ్చిన వారు ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు వైద్యులు ఇచ్చే మందుల‌ను వాడాలి. దీంతోపాటు ఆహారంలోనూ ప‌లు మార్పులు చేసుకోవాలి. కొన్ని ర‌కాల ప‌దార్థాల‌ను మానేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తినాల్సి ఉంటుంది. అవేమిటంటే..

గౌట్ ఉన్న‌వారు తిన‌కూడ‌ని ఆహారాలు

గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌రాదు. సేవిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు విప‌రీతంగా పెరిగిపోతాయి. మ‌ట‌న్‌, బీఫ్‌, పోర్క్ వంటి మాంసాహారాల‌ను తిన‌రాదు. వీటిల్లో ప్యూరిన్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని మానేయాలి. అలాగే చేప‌లు, రొయ్య‌లను తీసుకోరాదు. సోడాలు, శీత‌ల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్‌ల‌ను తిన‌రాదు.

గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు తీసుకోవాల్సిన ఆహారాలు

కొవ్వు లేని పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను తీసుకోవ‌చ్చు. పెరుగు, మ‌జ్జిగ, తాజా పండ్లు, కూర‌గాయ‌లు, న‌ట్స్‌, తృణ ధాన్యాలు, నారింజ పండ్ల ర‌సం, విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. దీంతో గౌట్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

అలాగే గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు నీటిని ఎక్కువ‌గా తాగాలి. యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేయించుకుని వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడాలి.

Share
Admin

Recent Posts