బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి గింజలను వడకట్టాలి. తరువాత వచ్చే నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని నిత్యం తాగాలి. దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రం అవుతుంది.
శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వారు బార్లీ నీటిని తాగడం వల్ల వేడి తగ్గుతుంది.
కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది.
మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని నిత్యం తాగితే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
బార్లీ నీటిని తాగడం వల్ల చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోన్లు ఇట్టే కరిగిపోతాయి.
శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. నిత్యం బార్లీ నీటిని తాగాలి.
బార్లీ నీటిని తాగడం వల్ల మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని నిత్యం ఉదయం, సాయంత్రం తాగాలి.